నిరసనపై పోలీస్‌ జులుం | - | Sakshi
Sakshi News home page

నిరసనపై పోలీస్‌ జులుం

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

● దిష్టిబొమ్మ దహనం సమయంలో ప్రత్తిపాడు ఎస్‌ఐ అత్యుత్సాహం ● మండుతున్న దిష్టిబొమ్మతో దూసుకొచ్చిన ఎస్‌ఐ నరహరి ● తీవ్ర భయాందోళనకు గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ● ఇద్దరు నాయకులకు అంటుకున్న మంటలు ● నిరసన ర్యాలీలో ఒక్కసారిగా ఉద్రిక్తత ● ఎస్‌ఐ తీరును నిరసనగా బలసాని కిరణ్‌కుమార్‌ రోడ్డుపై బైఠాయింపు ● ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ప్రత్తిపాడు: ౖవెఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునే పేరుతో మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తల వైపు ఎస్‌ఐ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించారు. వివరాలు.. ప్రత్తిపాడులో శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బస్టాండు సెంటరులోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట పార్టీ శ్రేణులు డీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేసి, చంద్రబాబు డౌన్‌ డౌన్‌.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంతలో అక్కడకు వచ్చిన ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎన్‌.నరహరి మంటల్లో దహనమవుతున్న దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. అంతటితో ఆగకుండా మంటలు ఎగసి పడుతున్న దిష్టిబొమ్మను తీసుకుని గుంపుగా ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల వైపు దూసుకొచ్చారు. ఎస్‌ఐ చేతిలో ఉన్న దిష్టిబొమ్మను లాక్కుని కింద పడేసేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు మండలానికి చెందిన పార్టీ నాయకుడు రాంబాబు చేయికి అంటుకుని బొబ్బలు రావడంతో పాటు చొక్కాకు నిప్పు అంటుకుంది. అదే విధంగా గుంటూరు రూరల్‌ మండలానికి చెందిన లక్ష్మి చీరకు కూడా మంటలు అంటుకోవడంతో చీర కాలిపోయింది. పార్టీ శ్రేణులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది.

అత్యంత దుర్మార్గంగా ఎస్‌ఐ తీరు..

ప్రత్తిపాడు ఎస్‌ఐ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్తిపాడు మెయిన్‌ రోడ్డులో పాతమద్రాసు రోడ్డుపై వైఎస్సార్‌ కాంస్య విగ్రహం ఎదుట బైఠాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం.. పోలీసుల జులుం నశించాలి.. డౌన్‌ డౌన్‌ పోలీస్‌.. ఉయ్‌వాంట్‌ జస్టిస్‌.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు కిరణ్‌కుమార్‌ వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీసులు ఇంత సెన్స్‌లెస్‌గా చేసిన పని వలన ఒక నాయకుడికి చేయి కాలిందని, మరో మహిళా నాయకురాలికి చీర కాలిందని, పొరబాటున ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటే బాధ్యులు ఎవ్వరని ప్రశ్నించారు. ఎస్‌ఐ నరహరి అసభ్య పదజాలంతో పార్టీ నాయకులు, శ్రేణులను దూషించడం బాధాకరమన్నారు. అత్యంత దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఎస్‌ఐపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బలసాని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్‌ గులాం రసూల్‌ మాట్లాడుతూ ఏమైనా తప్పు జరిగితే పోలీసులు కేసు రిజిస్టర్‌ చేయాలే గానీ, ఇలా హత్యా ప్రయత్నం చేయడం ఏమటని ఎస్‌ఐ నరహరిని ప్రశ్నించారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా అని మండిపడ్డారు.

ఫ్లెక్సీలు తొలగించాలంటూ..

అంతకుముందు కూడా ప్రత్తిపాడు ఎస్‌ఐ గ్రామంలో రోడ్డుపై కట్టిన వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ హడావుడి చేశారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులో విద్యుత్‌ స్తంభాలకు చిన్న చిన్న కట్టడంతో అసలు ఎవరిని అడిగి కట్టారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఫైర్‌ అయ్యారు. ఆ సమయంలోనూ వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement