గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్‌కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది.
ఏపీ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ బాధ్యతల స్వీకారం
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అభిషేక్ కుమార్ అడిషనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయం 2వ ఫ్లోర్‌లోని ఆయన చాంబర్ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అభిషేక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు తొలుత ఏపీ సీఆర్డీయే ఆఫీస్ మేనేజ్‌మెంట్ విభాగ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస్, కమ్యూనికేషన్‌న్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అభిషేక్ కుమార్‌కి ఏపీ సీఆర్డీయేలోని పలు విభాగాల ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
నేటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులు
గుంటూరు వెస్ట్: చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే చట్టరీత్యా నేరమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ తెలిపారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీతో పాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చిన్నారులందరూ విధిగా పాఠశాలలకు వెళ్ళి విద్యనభ్యసించాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు ఉప కార్మిక శాఖ కమీషనర్ ఎ.గాయత్రీ దేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు.


