మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలు పంపే పనిలో పోలీసులు ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు.
పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్ వీరన్నపాలెం డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు.
దెబ్బ తింటున్న సంప్రదాయాలు..
ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన్ వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం.
‘జనరల్ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు..
రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్ నాయుడు పాల్గొనగా కళానికేతన్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు.


