తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి శ్రీనివాసనాయక్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఔత్సాహికులు సినిమా నటనపై కనీస అవగాహనకు రాగలిగామని చెప్పటంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం దిలీప్‌రాజా చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. అవసరమైన చర్చల సందర్భంలో మా–ఏపీకి ఆహ్వానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మూడురోజుల నటశిక్షణ తీసుకున్న 60 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆడిషన్ల పేరుతో, కార్డుల పేరుతో డబ్బులు వసూలుచేస్తున్న సంఘాల పట్ల ఔత్సాహికులు అప్రమత్తంగా ఉండాలని దిలీప్‌రాజా సూచించారు. డీఓపీ మైనేని హరిప్రసాద్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, శకనాల చంద్రశేఖర్, స్టయిల్ రవి, పాత్రుడు, వర్మ, జాలా రాజకుమారి, బాషా తదితరులున్నారు.


