గుంటూరు జీజీహెచ్‌లో పెట్‌ సీటీ స్కానర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గుంటూరు జీజీహెచ్‌లో పెట్‌ సీటీ స్కానర్‌ ప్రారంభం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో రూ. 18 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్‌ సీటీ స్కానర్‌ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌, రామాంజనేయులుతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తెలంగాణలో కూడా ఒకే గవర్నమెంట్‌ ఆస్పత్రిలో ఈ పరికరం ఉందన్నారు. ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ వైద్య సేవలు పేద రోగులకు రెండేళ్లపాటు ఉచితంగా అందించేలా ఈ సెంటర్‌ నిర్మాణం చేసిన డాక్టర్‌ వి.సి.నన్నపనేనికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రూ. 30 కోట్లతో సెకండ్‌ రేడియో థెరపీ వైద్య పరికరం రాబోతున్నట్లు వెల్లడించారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఈ పరికరం ఏర్పాటు ద్వారా దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ 1 క్యాన్సర్‌ సెంటర్‌గా నాట్కో సెంటర్‌ రూపాంతరం చెందిందని చెప్పారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామప్రభు, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిగా ఏపీలో క్యాన్సర్‌ ఉచిత స్క్రీనింగ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణ, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ నన్నపనేని సదాశివరావు, ట్రస్టు కో ఆర్డినేటర్‌ యడ్లపాటి అశోక్‌కుమార్‌, గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement