రానున్న ఐదు రోజులు ఎండ తీవ్రం | - | Sakshi
Sakshi News home page

రానున్న ఐదు రోజులు ఎండ తీవ్రం

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

● ఉష్ణోగ్రత 41 – 54 డిగ్రీల సెల్సియస్‌ వరకు అవకాశం ● జిల్లా కలెక్టర్‌ సాయి కాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: రానున్న ఐదు రోజులపాటు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయి కాంత్‌ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న ఐదు రోజులలో వేసవి తీవ్రత (హీట్‌ ఇండెక్స్‌) అధికంగా ఉంటుందని సూచించిందన్నారు. 41 – 54 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత ఉండవచ్చని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు ఫిరంగిపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, గుంటూరు పశ్చిమం, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచెరుకూరు, తుళ్ళూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ఆయన సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబసభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్‌, బీపీ ఉన్నవారు ఎండలో తిరగవద్దని సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

పింఛన్లు పంపిణీ

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్‌ సి.ఎం. సాయి కాంత్‌ వర్మ శుక్రవారం స్థానిక ఆకులవారి తోటలో పంపిణీ చేశారు. స్థానికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,53,379 మంది పింఛనుదారులకు రూ.110.50 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement