గెడ్డేటి సురేంద్ర విమర్శ స్పీకర్‌పై కేసు నమోదుకు డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు పాలనలో దళితులపై అరాచకాలు, దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర విమర్శించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ ‘డప్పు కళాకారుడిపై చేయి చేసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయకుండా కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల హక్కులపై మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ దళిత నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతున్నారు. ప్రభుత్వం తీరు ఇదే తీరున కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతాం. పేదలు కాకుండా ధనికులకే అమరావతి నిలయంగా మారుతోంది. ప్రైవేటు వర్సిటీలు విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా రాయితీలు పొందుతున్న సదరు విద్యాసంస్థలు పేద, దళితులకు ఒక్కసీటు ఉచితంగా ఇవ్వలేదు. దీనిపై పోరాటానికి శ్రీకారం చుడతాం’ అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అంకాల రాజు, జి.ప్రభు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పేరుపోగు బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.


