పార్టీ నేతలు అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
గుంటూరు ఎడ్యుకేషన్: జగ్జీవన్‌రామ్ ఆశయాలను ఆచరణలో పెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనలో పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాన మంత్రి జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), ఎస్సీ విభాగం నాయకులతో కలసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో సైన్యానికి నాయకత్వం వహించి, పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించారని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే, పేద, బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు రాజ్యాంగ ఫలాలను అందించేందుకు జగ్జీవన్‌రామ్ విశేషంగా కృషి చేశారని అన్నారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలతో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందన్నారు.
తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ కుల వివక్ష, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జగ్జీవన్‌రామ్ చిరస్మరణీయుడని అన్నారు. దళితులకు, అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ దళితుల ముద్దుబిడ్డగా కీర్తి పొందారని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిలు అంకాల రాజు, జి.ప్రభు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పేరుపోగు బాబు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు పల్లపు మహేష్, నాయకులు బెంజిమెన్, దేవదాసు, అశోక్, కూచిపూడి సాయికిరణ్, చింతపల్లి వెంకటరమణ, వెంకాయమ్మ, రమణి, త్రివేణి పాల్గొన్నారు.


