నలుగురికి తీవ్ర గాయాలు
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలపై పచ్చ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో నలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు.. శనివారం రాత్రి రేపల్లె బస్టాప్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎస్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపీ వేచి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న స్థానిక టీడీపీ నేతలు భవానీ శంకర్, దుర్గాప్రసాద్, చందు ద్విచక్రవాహనంపై వచ్చి ఇనుపరాడ్లు, రాళ్లతో గోపిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం 13వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు మండ్రు మనోహర్, వెంకటరత్నం, జేమ్స్‌పై ఈ ముగ్గురు టీడీపీ నేతలు బీరు బాటిళ్లు, ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. వారిని చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. నిందితులపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు గోపీ పేర్కొన్నారు.
పొన్నూరులో గూండా రాజ్యం నడుస్తోంది
పొన్నూరు నియోజకవర్గంలో గుండా రాజ్యం నడుస్తోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు దేవరకొండ గోపితోపాటు మండ్రు మనోహర్, వెంకటరత్నం, జేమ్స్‌లపై టీడీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులతో ఫోన్‌లో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా చేసుకుని టీడీపీ రౌడీలు హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రోత్సాహంతోనే టీడీపీ గూండాలు 24 గంటల్లో రెండు సంఘటనల్లో ౖ దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలకు కేంద్రంగా టీడీపీ పొన్నూరును మార్చిందని విమర్శించారు. సోమవారం ఉదయం పట్టణంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.


