మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరి మండలం ఆత్మకూరు హనుమాన్‌నగర్‌కు చెందిన వెంకట సాయిరామ్ తన భార్యతో కలసి శనివారం రాత్రి నులకపేటలోని అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం తన ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరచి ఉంచడం గమనించి లోపలకు వెళ్ళాడు. బీరువా తాళాలు పగలకొట్టి బట్టలు చిందరవందరగా పడవేసి ఉండడం గమనించాడు. బీరువాలో వున్న సుమారు 2 లక్షల నగదుతో పాటు 3 బంగారపు ఉంగరాలు, జత చెవి కమ్మలు, ఒక వెండి గిన్నె చోరీకి గురైనట్లు గుర్తించాడు. బంగారం సుమారు 20 గ్రాముల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాచారం ఇవ్వడంతో మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


