కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు
తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషనన్ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలి హెడ్ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్ పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక డివిజనల్ కార్యదర్శి ఎల్.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్, రషీద్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్ కార్యదర్శి ఎన్‌జీ ఘోష్, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు.
తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్‌వీ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్‌తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్‌మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో 2025 డిసెంబర్‌లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్‌కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్‌కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు.


