ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పడాలి
కొరిటెపాడు(గుంటూరు): దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించాలని తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం గుంటూరు నగరం ఆర్.అగ్రహారంలోని రామనామ క్షేత్రం ప్రాంగణంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం తులసి రామచంద్ర ప్రభు, ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా జరిగింది. 270 మంది విద్యార్థులకు రూ.12,12,500 చెక్కుల రూపంలో ఉపకార వేతనాలను అందజేశారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ 1995–96లో ఇద్దరు విద్యార్థులతో మొదలుపెట్టి నేటికి సుమారు 40 వేల మంది విద్యార్థులకు రూ.23 కోట్లు ఉపకార వేతనాలుగా ట్రస్టు ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి మేజర్ కాంట్రిబ్యూషన్ తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దీంతో పాటు నగరంలోని కొంతమంది సమాజ హితం కోరే పెద్దలు ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టులో సభ్యులుగా చేరి సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు తులసి రామచంద్ర ప్రభును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, ట్రస్ట్ సభ్యులు నారదాసు శ్రీహరిరావు, తిమ్మిశెట్టి నారాయణరావు, పసుపులేటి రమణయ్య, అంకిరెడ్డి సాంబశివరావు, నారదాసు కోటేశ్వరరావు, పుచ్చకాయల ఆనంద్, కనదం నరేంద్రనాథ్, దళవాయి సుబ్రమణ్యం, మిరియాల శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు
270 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ


