గిట్టుబాటు.. కప్పదాటు | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు.. కప్పదాటు

Dec 18 2025 7:51 AM | Updated on Dec 18 2025 7:51 AM

గిట్ట

గిట్టుబాటు.. కప్పదాటు

గిట్టుబాటు.. కప్పదాటు

ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ జరగటం లేదు

జిల్లాలో 66,082 హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు దిగుబడి అంచనా 4,22,928 మెట్రిక్‌ టన్నులు వచ్చింది 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది 26 వేల టన్నులే.. తేమ శాతం, నిబంధనల పేరుతో కొనని ప్రభుత్వం తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీ

పది రోజులు ఆరబెట్టినా ఫలితం శూన్యం

అదునుకు కొనుగోలు చేయక..

గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ అరకొరగానే జరుగుతోంది. గోతాలు లేవని,మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ (బిజీ) పూర్తయింది అని జాప్యం చేస్తున్నారు. 75 కిలోల ధాన్యం బస్తా రూ.1792 కొనుగోలు చేయాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.1400 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.

– మట్టుపల్లి పోతురాజు,

రైతు, సుద్దపల్లి, చేబ్రోలు మండలం.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆరుగాలం శ్రమించి తుపాన్లు, భారీ వర్షాలను తట్టుకుని పండించిన రైతులకు గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

తేమ, నూక శాతం పేరుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే, దళారులు ధర తగ్గించి రైతులను నష్టాలపాలు చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో 66,082.46 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు 64 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. అంటే మొత్తం 4,22,928 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావాలి. వాస్తవంగా జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల కంటే వచ్చే పరిస్థితులు లేవని రైతు సంఘాలు, నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 188 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 26 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల వద్ద దండిగా ఉన్న సమయంలో తుపాన్లు, తేమ శాతం నిబంధనల పేరుతో సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి, వారు చెప్పిన తక్కువ ధరకే అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు లక్ష్యానికి దూరంగానే మిగిలిపోయింది.

కొనుగోలుకు సవాలక్ష నిబంధనలు

ప్రభుత్వం ఏ– గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.2,389, 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర ప్రకటించింది. అయితే, తేమ, నూక పేరుతో మిల్లర్లు, దళారుల దోపిడీకి కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి సేకరణ నిబంధనల మేరకు గరిష్ట తేమ 17 శాతం ఉండాలి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నాలుగు, ఐదు రోజుల పాటు ఆరబోసిన ధాన్యాన్ని మిల్లుకు పంపితే నూక పేరుతో, తేమ అధికంగా ఉందంటూ తరుగు తీస్తున్నారు. ఆరబెట్టినా, పెట్టకపోయినా బస్తాకు మూడు కిలోల కోత మాత్రం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు చెందిన ధాన్యాన్ని ఒకే లారీలో మిల్లుకు పంపుతుంటారు. వీరు పంపిన లోడులో ఇతరుల పేరుతో కొన్ని బస్తాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 75 కిలోల బస్తాకు ఒక్కో రైతు రూ.70 నుంచి రూ.100 వరకు నష్టపోతున్నాడు. గత్యంతరం లేక రైతులు, దళారులను ఆశ్రయిస్తూ వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఇప్పటి దాకా వారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.

రైతుల సమస్యలు పట్టడం లేదు .

మండలాల్లో అధికార యంత్రాంగం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కల్లాల్లోనే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం బస్తా రూ.1400 లకే వ్యాపారులు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. కూలీ, బాడుగకు రూ. 44 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 75 కిలోల బస్తాకు 60 రూపాయలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

నిలదీస్తే కొర్రీలు

అక్రమ కోత, తరుగును ప్రశ్నిస్తే ధాన్యం సేకరణలో కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మిల్లుల వద్ద రైతులు, నిర్వాహకుల మధ్య నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయి. 75 కిలోల బస్తాకు మూడు కిలోల తరుగును అనుమతిస్తేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారని సమాచారం. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలుతో పాటు కోత ధరలు అమాంతం పెరగడంతో నష్టాలను ఎదుర్కొంటున్నారు.

నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసినా ఆశించిన ఫలితంలేదు. ఎకరాకు 40 బస్తాలు ధాన్యం వస్తుందని ఆశిస్తే 28 బస్తాలు మాత్రమే దక్కింది. ఎండలో తిరగబెడుతూ పది రోజులు ఆరబెట్టినా ధర రూ.1520 దాట లేదు.

– వెంకటాద్రి, రైతు, పచ్చలతాడిపర్రు

చేతికి అందివచ్చిన ఖరీఫ్‌ పంట ఇక నోటికి అందుతుందనుకున్న రైతుల ఆశలపై అధిక వర్షాలు, వరుస తుపాన్లు నీళ్లు జల్లాయి. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసి, కష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని అన్నదాతలు భావించారు. అయితే తేమ శాతం నిబంధనల పేరుతో ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసింది. మరో గత్యంతరం లేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన తక్కువ రేటుకే అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దళారులు సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.

గిట్టుబాటు.. కప్పదాటు 1
1/3

గిట్టుబాటు.. కప్పదాటు

గిట్టుబాటు.. కప్పదాటు 2
2/3

గిట్టుబాటు.. కప్పదాటు

గిట్టుబాటు.. కప్పదాటు 3
3/3

గిట్టుబాటు.. కప్పదాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement