కారు డ్రైవింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 2026 మార్చి 1వ తేదీ నుంచి కారు డ్రైవింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్‌డీఏ, వెలుగు సౌజన్యంతో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవింగ్‌లో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే జనవరి 22 వరకు మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడం జరగుతోందని, జూట్ ప్రొడక్ట్స్‌లో వచ్చే జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు 19 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని స్పష్టం చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనంతో పాటు, వసతి కల్పించడం జరుగుతోందని వివరించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఓల్డ్‌క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు, 0863–2336912, 8125397953, 9700687696 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు
జిల్లాలో 474 మందికి కౌన్సెలింగ్
నగరంపాలెం: జిల్లాలో ఈవ్‌టీజింగ్, ఇష్టానుసారంగా మోటారుసైకిళ్లను నడిపే వారిని గుర్తించే ప్రత్యేక డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈవ్‌టీజింగ్‌కి పాల్పడిన 260 మంది, బైక్ పోటీలు, బైక్‌లపై వంకర్లుగా వెళ్తూ మిగతా చోదకులను ఇబ్బందులకు గురిచేసే 214 మందిని గుర్తించారు. ఈ మేరకు వారికి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. స్కూళ్లు, కళాశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్‌లు, థియేటర్లు, రైల్వే/బస్టేషన్లు వద్ద డ్రైవ్ కొనసాగింది. ఈవ్‌టీజింగ్, బైక్ పోటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
సమస్యల పరిష్కారానికి డీడీఓలను ఆశ్రయించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత, సర్వీసు రూల్స్, ఫిర్యాదులను డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ అధికారి (డీడీవో) ద్వారా పరిష్కరించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీవో స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, ఫిర్యాదులను డీఈవో, ఆర్జేడీకి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పీల్స్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులను సంప్రదించిన పక్షంలో సీసీఏ నిబంధలన ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


