ఎయిమ్స్‌లో పరిశోధనలకు పెద్దపీట
మంగళగిరి టౌన్: వైద్య రంగంలో మంగళగిరి ఎయిమ్స్ గణనీయమైన పరిశోధనలు చేపడుతోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో బుధవారం అనుసంధాన దివస్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాల్గవ వార్షికోత్సవ పరిశోధన దినోత్సవాన్ని డాక్టర్ అహంతం శాంతసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ గురువారంతో ముగియనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైద్యవిద్య, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎయిమ్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపడుతోందని, రక్తహీనత, సికెల్ సెల్ వ్యాధి వంటి సాధారణ, సంబంధిత ప్రజా సవాళ్లపై కూడా దృష్టి పెడుతోందని తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాపులో వివిధ విభాగాల వైద్య విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేశారని చెప్పారు. ఎయిమ్స్‌లో పేషెంట్ కేర్, మెడికల్ స్టూడెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ చక్కగా జరుగుతోందని ఇందుకు నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్‌షాప్ నిదర్శనమన్నారు. మెడికల్, సర్జికల్, డెంటల్, నర్సింగ్ డిపార్ట్‌మెంట్లతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లలో 40 సెక్షన్లలో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు కేటగిరీల కింద రీసెర్చ్ చేసిన వారికి బహుమతులు అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజ్డ్ చైర్‌పర్సన్, డీన్ (రీసెర్చ్) డాక్టర్ జాయ్ ఎ.గోషల్, అసోసియేట్ డీన్ (రీసెర్చ్) డాక్టర్ మాధవరావు, అసిస్టెంట్ డీన్ (రీసెర్చ్) ఆర్తి గుప్త, ఆంధ్రప్రదేశ్ మాజీ డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. బాబ్జీ, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ గోపాలన్, శోద్ క్లినికల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోనికా బహల్, నోవార్టిస్‌కు చెందిన డాక్టర్ అరుణ్‌భట్‌తో పాటు పలువురు ప్రతినిధులు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.
ఈడీ డాక్టర్ అహంతం శాంతసింగ్


