పరిశోధన ప్రణాళికపై వర్క్‌షాప్
గుంటూరు రూరల్: హైదరాబాద్‌కు చెందిన ఐసీఏఆర్ జాతీయ నూనెగింజల పరిఽశోధన సంస్థ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్‌లో గుర్తించిన వ్యవసాయ ప్రాముఖ్యత అంశాల ఆధారంగా పరిశోధన ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. గురువారం నగర శివారులోని లాంనందున్న విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జాతీయ పరిశోధన స్థానాలకు చెందిన ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ పశుసంవర్ధక, ఉద్యాన శాఖల ప్రతినిధులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐఐఓఆర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌కే మాధుర్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలకు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, అపరాలు, మామిడి తదితర పంటల్లో పరిశోధన, విస్తరణ అవసరాల ఆధారంగా తయారు చేసిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఆర్‌కు పంపుతామన్నారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ పంటల్లో అవసరమైన కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.


