విద్యార్థినికి దండన ఘటనపై చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: వుూడో తరగతి విద్యార్థినిని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనలో ప్రైవేటు పాఠశాలకు చెందిన ఇన్‌చార్జ్ హెచ్‌ఎంతో పాటు మరొక ఉద్యోగినిపై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థిని తల్లి గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా ఆదేశాలతో మంగళవారం గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్ ఖుద్దూస్ పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించారు. అత్యవసరంగా టాయిలెట్‌కు వెళ్లేందుకు మూడో తరగతి విద్యార్థిని పడిన ఇబ్బందిని గుర్తించకుండా నిర్థాక్షిణ్యంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను తిలకించారు. ఎంఈవో సమర్పించిన నివేదిక ఆధారంగా విద్యార్థినిపై క్రమశిక్షణ చర్యల పేరుతో విద్యాహక్కు చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఈవో సలీమ్‌బాషా ఆదేశాలతో జరిగిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ఇన్‌చార్జ్ హెచ్‌ఎంతో పాటు మరొక నాన్ టీచింగ్ ఉద్యోగినిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.


