ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్
ప్రత్తిపాడు: పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఐడీఈ బూట్ క్యాంప్ తమ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కిట్స్ కళాశాలలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (ఐడీఈ) బూట్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసీటీఈ, ఎంవోఈ ఇన్నోవేషన్ సెల్, ఎస్‌సీఈఆర్టీ, స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, వాధ్వానీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ క్యాంప్‌కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సంబంధిత స్కూల్స్ ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల్లో ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ వ్యాపారోన్ముఖ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంప్ చేపడుతుందని వివరించారు. బూట్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆర్జేడీ వి.లింగేశ్వర రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు నిపుణులైన రిసోర్స్ పర్సన్లతో లెక్చర్లు, వర్క్ షాపులు, హ్యాండ్స్–ఆన్ సెషన్లు నిర్వహించబడతాయని తెలిపారు. కళాశాల సెక్రటరీ కోయి శేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను మరింత మెరుగు పరిచేందుకు బూట్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. హరిబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాబు, బూట్ క్యాంప్ ఇన్‌చార్జి ఎస్‌పీవోసీ డాక్టర్ అరుణ పాల్గొన్నారు.
కిట్స్ కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు


