బాబు కుట్రలపై నిరసన ‘సంతకం’
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణకు భారీగా స్పందన వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించిన ప్రజలు అన్నివర్గాల వారి నుంచి ఉద్యమానికి అనూహ్య మద్దతు గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో చురుగ్గా సాగిన సేకరణ
పట్నంబజారు: వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు చేసిన ఒక్కో సంతకం చంద్రబాబు సర్కారు కుట్రలపై నిరసన తీవ్రత తెలుపుతోంది. రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అయింది. ప్రజా ఉద్యమంలా ముందుకు సాగింది. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలకు అందకుండా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాలతో మద్దతు తెలిపారు. అన్నివర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజలు భారీగా తమ సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెప్పారు.
అవగాహన కల్పించి మరీ...
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23 డివిజన్‌లలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 1వ డివిజన్ నుంచి 15వ డివిజన్ వరకు, 17, 50, 51, 53, 54, 55. 56, 57 డివిజన్‌లలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నూరి ఫాతిమా 14 డివిజన్‌లలో స్వయంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. అనేక డివిజన్‌లలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరిగితే జరిగే అనర్థాలను ప్రజలకు స్వయంగా వివరించారు. అందరితో మమేకమవుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజెప్పారు. అనేక డివిజన్‌లలో ఆమె పర్యటించిన నేపథ్యంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 65 వేల సంతకాలను సేకరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, యువజన విద్యార్థి విభాగం నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోర్ కమిటీ నేతల సహాయ సహకారాలతో సంతకాల సేకరణ పూర్తయింది. కార్యక్రమానికి మైనార్టీ అసోసియేషన్ నేతలు, అఖిల భారత వడ్డెర సంఘం, మాదిగ సంక్షేమ పోరాట సమితి, ఆటో యూనియన్ నేతలు మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయానికి నియోజవకర్గం నుంచి సేకరించిన సంతకాల పత్రాలను పంపారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి.


