గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ
గుంటూరు వెస్ట్: డిస్ట్రిబ్యూటర్లు అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయించినా, డెలివరీ బాయ్స్ ఎక్కువ మొత్తాలు వసూలు చేసినా, అమర్యాదగా ప్రవర్తించినా చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం గ్యాస్ ఏజన్సీస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహించనున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలో జిల్లా 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. ఏజెన్సీల పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. ఉజ్వల 3.0 పథకంలో భాగంగా ఎల్‌సీజీ కనెక్షన్లు త్వరగా అందజేయాలని తెలిపారు. పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న 10 మంది గ్యాస్ ఏజెన్సీ యజమానులపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ప్రభుత్వ సేవలు
ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల సంతృప్తి మేరకు సేవలు అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో పరిశుభ్రత మరింత మెరుగు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అధికారులు పాల్గొన్నారు.


