చిన్నారుల గోడు ‘చెవి’కెక్కదా?
ఈఎన్‌టీ విభాగంలో నిలిచిన ఆపరేషన్లు కాక్లియర్ ఆపరేషన్ చేస్తే పిల్లల వినికిడి సమస్యకు చెక్ ఈఎన్‌టీ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రైవేటు ఆస్పత్రులకు తరలింపు ఆపరేషన్ చేస్తే జీజీహెచ్‌కు, వైద్యులకు కూడా ఆదాయం రెండేళ్లుగా పట్టించుకోని ఆసుపత్రి అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ చూపించాలని బాధితుల వినతి
గుంటూరు జీజీహెచ్‌లో కాక్లియర్ శస్త్రచికిత్సలకు గ్రహణం
గుంటూరు జీజీహెచ్‌లో గత ప్రభుత్వంలో ఉచితంగా కాక్లియర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన ఒక్కొక్కరికి సుమారు రూ.16 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్లు ఉచితంగా చేశారు. రెండేళ్లుగా ఈ ఆపరేషన్‌లకు గ్రహణం పట్టింది. ఈఎన్‌టీ వైద్యులు ఆపరేషన్‌లకు ముందుకు రాకపోవడం, అధికారులు చొరవ చూపక పోవడంతో పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేసినప్పటికీ స్పీచ్ థెరపీ, ఇతర వైద్య పరీక్షల నిమిత్తం కొంత డబ్బు వసూలు చేస్తున్నారు.
గుంటూరు మెడికల్: దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి సారిగా కాక్లియర్ ఆపరేషన్లు చేసిన సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఇ.సి.వినయ్‌కుమార్ తన స్వచ్ఛంద సంస్థ సాహి ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేశారు. ఆపరేషన్లకు అవసరమైన సుమారు రూ.50 లక్షల ఖరీదు చేసే వైద్య పరికరాలను సైతం ఆయన జీజీహెచ్‌కు అందజేశారు. ఆయన ఆపరేషన్లు చేయటంతోపాటు జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ వైద్యులకు అందులో మెలకువలు నేర్పించారు. ఆ తరవాత జీజీహెచ్ ఈఎన్‌టీ వైద్యులు కొద్దిరోజులపాటు ఆపరేషన్లు చేసి అర్ధంతరంగా నిలిపివేయడంతో నేడు వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కాక్లియర్‌తో చెక్ ...
వినికిడి సమస్యలకు చెక్ పెట్టేందుకు కాక్లియర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒక చెవికి ఆపరేషన్ చేసేందుకు సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మొట్టమొదటిసారిగా ఒక చెవికి కాక్లియర్ ఆపరేషన్ చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో రెండు చెవులకు ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు చేసేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పు చేశారు.
15 మందికి విజయవంతం
పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న 15 మంది చిన్నారులకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా ఒక్కొక్కరికి సుమారు రూ.16 లక్షల ఖరీదు చేసే కాక్లియర్ ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేశారు. పేదలకు ఎంతో ఉపయోగకరంగా, నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు చేసే సౌకర్యం జిల్లా మొత్తంలో గుంటూరు జీజీహెచ్‌లోనే ఉంది. జీజీహెచ్ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి కాక్లియర్ ఆపరేషన్లు చేస్తున్నారేగానీ, జీజీహెచ్‌లో ఆపరేషన్లు జరిగేలా చూసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ ఆపరేషన్లు చేయడం ద్వారా అధిక మొత్తంలో ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా జీజీహెచ్‌కు ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్, విశాఖపట్నం కింగ్‌జార్జ్ ఆస్పత్రుల్లో మాత్రమే ప్రభుత్వపరంగా కాక్లియర్ ఆపరేషన్లకు అవకాశం ఉంది. జీజీహెచ్‌లో గతంలోలా నేడు కూడా కాక్లియర్ ఆపరేషన్లు జరిగేలా చూడాలని పలువురు బాధితులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను కోరుతున్నారు.
చిన్నారుల గోడు ‘చెవి’కెక్కదా?


