‘సామాజిక’ మత్తు వల | - | Sakshi
Sakshi News home page

‘సామాజిక’ మత్తు వల

Dec 3 2025 7:29 AM | Updated on Dec 3 2025 7:29 AM

‘సామాజిక’ మత్తు వల

‘సామాజిక’ మత్తు వల

గంజాయి, మద్యం మత్తులో హల్‌చల్‌

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో సెర్చింగ్‌

మైనర్‌ బాలికలే వారి లక్ష్యం

ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ముంచుతున్న యువత

లబోదిబోమంటున్న బాలికల తల్లిదండ్రులు

కేసులను నీరుగారుస్తున్న పోలీసులు

తాడేపల్లి రూరల్‌ /పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో సామాజిక మాధ్యమాలలో వల విసురుతున్నారు. బాలికలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. బాలికల తల్లిదండ్రుల నుంచి వారితో డబ్బు తెచ్చేలా చేసి పబ్బం గడుపుతున్నారు. పరిచయమైన నాలుగైదు రోజుల్లోనే ఆకర్షణీయమైన ప్రదేశాల్లో తిప్పుతూ లాడ్జీలకు తీసుకువెళ్లి అసభ్యకరంగా ఫొటోలు సైతం తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ తరహాలో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు సంఘటనలు జరిగాయి.

ఇవిగో నిదర్శనాలు...

ఒక బాలిక తనకు 18 సంవత్సరాలు నిండిన మొదటిరోజే ఆటో డ్రైవర్‌ అయిన మద్యం, గంజాయి అలవాటు ఉన్న వ్యక్తితో వెళ్లింది. ఆ బాలిక తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే రాజకీయ నాయకులు వచ్చి మైనారిటీ తీరిందని చెప్పడంతో వెనుదిరిగి వెళ్లారు. గత నాలుగు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మైనర్‌ అక్కాచెల్లెళ్లను ఆటో డ్రైవర్‌, మరో గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశారు. డబ్బులు, ఇతర వస్తువులు తీసుకురమ్మని చెప్పడంతో వారు నగదు, రూ.లక్ష విలువైన సెల్‌ఫోన్లు తీసుకువెళ్లి ఆ కేటుగాళ్లకు అప్పగించారు. తండ్రి కష్టపడి ఒక కుమార్తెను తీసుకురాగా, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ బాలిక అదేరోజు ఇంటి నుంచి మళ్లీ పరారైంది. రెండవ బాలిక ఆచూకీ నేటికీ లభించలేదు. సదరు ఆటోడ్రైవర్‌పై ఫిర్యాదు చేయకపోవడంతో తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి పారిపోయని బాలికను మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో ఉండే ఓ యువకుడు తాను పోలీస్‌ అని చెప్పి ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకువెళ్లాడు. మత్తుపదార్థాలు ఇచ్చి లోబర్చుకున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

డబ్బు కోసం జీవితాలు నాశనం....

ఇలా ప్రేమ వ్యవహారాలు నడిపే యువకులకు ప్రత్యేకంగా షెల్టర్‌ ఇచ్చేందుకు కొంతమంది పనిచేస్తున్నారు. ఈ బాలిక విషయంలో కూడా ఇదే తరహాలో జరిగింది. నవులూరులో ఉడా కాలనీలో నివాసముండే ఓ మహిళతోపాటు నులకపేటలో వివాహిత కూడా బాలికలకు ఏకాంతంగా గడిపేందుకు తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంప ముంచుతున్న కొత్త స్నేహాలు

ప్రస్తుతం యువత బయట కంటే సోషల్‌ మీడియాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పలకరింపులన్నీ ఆ వేదికగానే సాగుతున్నాయి. కొత్త కొత్త స్నేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో బాలికలు ఆకర్షణకు గురై లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పట్టాభిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో 17 సంవత్సరాల బాలిక ఒక యువకుడితో పరిచయం ఏర్పడటం, వారు శారీరకంగా కలవటం, ఆ బాలిక గర్భం దాల్చిన పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థిని తన బ్యాచ్‌ మేట్‌తోనే ఇలా పరిచయం కావడంతో ప్రైవేట్‌ ఫొటోలను పంపింది. అతడు ఇతరులకు పంపడంతో జైలుకు వెళ్లాడు. రెండు నెలల క్రితం కొత్తపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో సైతం ఒక మైనర్‌ను యువకుడు తీసుకెళ్లాడు. గుంటూరు యువకుడు ఒకరు తానరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరునని చెప్పి ఇన్‌స్ట్రాగామ్‌లో పరియమైన విజయవాడకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినికి మోసం చేసేందుకు యత్నించాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కూలి పనులు చేసుకునే వ్యక్తిగా తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement