నకిలీ బాండ్లపై విచారణ వేగవంతం
మంగళగిరి టౌన్: మంగళగిరి, కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) జరిగిన నకిలీ బాండ్ల అవినీతిపై అధికారులకు విచారణ వేగవంతం చేశారు. సీసీఆర్‌సీఎస్ కమిషనర్ అహమ్మద్ బాబు ఆదేశాల మేరకు గుంటూరు డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు అయిన వీరాంజనేయులు, మురళీకృష్ణలు మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్‌స్టేషన్‌లలో మంగళవారం సీఈవో రమేష్‌పై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్, జీడీసీసీ బ్యాంకుల విచారణ చేపట్టేందుకు తులసీ భ్రమరాంబ, సరళ, జయదాసు, భావన్నారాయణరాజులతో కూడిన బృందాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా నియమించినట్లు తెలియజేశారు. మంగళగిరి పీఏసీఎస్‌లో ఇప్పటికి 18 మంది ఖాతాదారులు నకిలీ బాండ్లతో రూ.1.99 కోట్లు, కురగల్లు పీఏసీఎస్‌లో 110 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు సంబంధించి నకిలీ బాండ్లతో రూ.7.98 కోట్ల నగదు మాయమైనట్లు తెలిపారు. ఇంకా బాధితులు, నకిలీ బాండ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా విచారణ సాగుతుందని పేర్కొన్నారు. నవంబర్ 20వ తేదీ వరకు రమేష్ అందుబాటులోనే ఉన్నారని, ఆ తరువాతే అమెరికా వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు క్రైం బ్రాంచ్ డీఎస్పీ మధుసూదనరావు మంగళవారం మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్‌లను పరిశీలించారు. ఆయా చైర్మన్లను వివరాలను అడిగి తెలుసుకొని, రికార్డులను చూశారు. కురగల్లులో బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. మంగళగిరి పట్టణ, రూరల్ సీఐలు వీరాస్వామి, ఎ.వి. బ్రహ్మం, సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ బాండ్లపై విచారణ వేగవంతం


