తాడేపల్లి రూరల్: ధరలు ఒక్కసారిగా పెరగడంతో కూరగాయలు కొనాలంటేనే వినియోగదారులు హడలిపోతున్నారు. సాధారణంగా చలికాలం వచ్చిందంటే దాదాపుగా అన్ని రకాల కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. చిక్కుడు ధర కచ్చితంగా తగ్గుతుంది. కానీ ఇప్పుడు అదే మిగతా వాటి కంటే ఎక్కువ పలుకుతోంది. నాటువి కిలో రూ. 120 ఉండగా, మిగిలిన కూరగాయలు కూడా రూ.50కిపైనే అమ్ముతున్నారు. కొనాలంటేనే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలకు కూరగాయల దిగుబడి బాగా తగ్గడం, నీరు లేక పంటలు దెబ్బతినడంతో ఇప్పుడు సరఫరా తగ్గిందని విక్రయదారులు చెబుతున్నారు. అన్ని కూరగాయల ధరలు కిలోకు రూ. 25 నుంచి రూ. 35 వరకు పెరిగాయి. ముఖ్యంగా ఉల్లి, టమోటా, బీట్‌రూట్, బీన్స్, క్యాప్సికం ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
మూడు వారాల క్రితం టమోటా కిలో రూ.30 ఉంది. ఇప్పుడు రెట్టింపు అయ్యింది. క్యాప్సికం కూడా నెల క్రితం రూ. 40 ఉండగా, ఇప్పుడు రూ.100కు చేరుకుంది. పచ్చిమిర్చి ఇంకా ఘాటుగానే ఉంది. రూ.60 కి విక్రయిస్తున్నారు. బంగాళా దుంప, దొండ, ములక్కాయ, ఆనపకాయలు తదితర కూరగాయలపై రూ. 20 నుంచి రూ.30 వరకు పెరుగుదల కనిపిస్తోంది.
గతంలో దుకాణానికి సంచి పట్టుకుని వెళితే రూ. 200 పెడితే వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేసుకునేవారు. ఇప్పుడు రూ. 300 నుంచి రూ. 500 వెచ్చిస్తేగానీ కొన్ని రకాలు రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కూరగాయలకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడడం, అక్కడి ధరల పెంపు ప్రభావం సామాన్యులపై పడింది. స్థానికంగా పండించే కూరగాయలు మార్కెట్‌లోకి వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదని వ్యాపారులు చెబుతున్నారు.
● భారీగా పెరిగిన కూరగాయల ధరలు
● హడలిపోతున్న వినియోగదారులు
● సామాన్యులకు తప్పని అదనపు భారం
రెట్టింపు కష్టాలు
దిగుమతి చేసుకున్నందున..
కూరగాయల దుకాణం
కూరగాయలు ధర (కిలో)
నాటు చిక్కుడు 120
క్యాప్సికం 100
బీన్స్ 90
క్యారెట్ 80
బీరకాయ 60
పచ్చిమిర్చి 60
టమాటా 60
బీట్‌రూట్ 70
బెండకాయ 50
దోసకాయ 50
దొండకాయ 40
వంకాయ 40
అల్లం 120
వెల్లుల్లి 160