నగర పాలక సంస్థలో ఆర్‌ఐ బదిలీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు ఇటీవల మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అల్లుడికి చెందిన ఓ హాస్పిటల్‌కి రూ.లక్షల్లో పన్ను తగ్గించారు. దీంతోపాటు లాలాపేటలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కూ పన్ను తగ్గించడంపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘కోడెల అల్లుడికి కార్పొరేషన్ నజరానా’ పేరిట కథనం ప్రచురితమైంది. హాస్పిటల్ విషయంలో రివిజన్ పిటిషన్ ఫైల్ చూసిన ఆర్‌ఐ సుబ్బారావు ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన గాంధీ పార్కు నగదును సొంతానికి వాడుకున్నట్లు రుజువు కావడంతో కొద్ది రోజుల క్రితమే సస్పెండ్ అయ్యారు. లాలాపేటలో కమర్షియల్ కాంప్లెక్స్‌కు పన్ను తగ్గింపు విషయంలో రివిజన్ పిటిషన్ ఫైల్‌ను ఆర్‌ఐ కాశయ్య చూశారు. శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా, కాశయ్యను టౌన్ ప్లానింగ్ సెక్షన్ జీ4కు బదిలీ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి ఆర్‌ఐ కాశయ్యపై గతంలో కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు రావడంతో అదనపు కమిషనర్ ఈ నెల 7వ తేదీన షోకాజ్ నోటీసు ఇచ్చారు. అప్పటి నుంచి కాశయ్యను మార్చని అధికారులు... ఇప్పుడు అకస్మాత్తుగా బదిలీ చేయడం గమనార్హం. బదిలీకి కారణం ఈ ఫిర్యాదు అని చెప్పడం గమనించాల్సిన అంశం. సాధారణంగా పన్ను తగ్గించే అంశం అడ్మిన్, ఆర్‌ఐ, రెవెన్యూ ఆఫీసర్ (ఆర్వో), డిప్యూటీ కమిషనర్ (డీసీ), అదనపు కమిషనర్, కమిషనర్ వరకు వెళుతుంది. కమిషనర్ నిర్ణయం మేరకు పన్ను తగ్గించాల్సి ఉంటుంది. ఆర్‌ఐదే బాధ్యత అన్నట్లుగా పరోక్షంగా బదిలీ చేయడంలో మతలబు ఏంటని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఈ రెండు ఆర్‌ఐ పోస్టులకు గతంలో పని చేసిన వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
కాశయ్య బదిలీ ఉత్తర్వులు
కోడెల అల్లుడికి చెందిన హాస్పిటల్,
మరో కాంప్లెక్స్‌కు పన్ను తగ్గింపుపై
‘సాక్షి’లో కథనం
పెద్ద తలకాయలను వదిలేసి ఆర్‌ఐను
వేరే కారణంతో బదిలీ చేసిన అధికారులు


