రేపు జిల్లాస్థాయి వెటర్న్ క్రీడా పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లాస్థాయిలో క్రీడా పోటీలను ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాదల చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య మహిళలకు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాకింగ్, త్రో, రన్నింగ్, జంపింగ్ తదితర పోటీలను మహిళలకు, పురుషులకు విభాగాల వారీగా వేర్వేరుగా జరుగుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి వెటరన్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల వివరాలను 9000979056, 9949526697లో సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన క్రీడా పోస్టర్‌ను అసోసియేషన్ సెక్రెటరీ జి.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ కిరణ్, ఈసీ మెంబర్ జి.గోపీనాథ్, ట్రెజరర్ సత్యనారాయణ ఎన్టీఆర్ స్టేడియంలో విడుదల చేస్తామన్నారు.
జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు
ఐదుగురు ఎంపిక
తూములూరు(కొల్లిపర): ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నున్నలో అండర్– 19, 14 విభాగాలల్లో తూములూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్ధులకు పాఠశాలలో పీడీ ఎస్.సాంబశివరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు అభినందించారు.
‘మా–ఏపీ’ సభ్యులు రెన్యువల్ చేయించుకోవాలి
తెనాలి రూరల్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్–ఏపీలో రెండేళ్ల సమయం పూర్తయిన సభ్యులందరరూ తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాలని ’మా–ఏపీ’ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. తెనాలి మండలం పెదరావూరు ఫిలిం స్టూడియోలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మార్చి 31లోగా రెన్యువల్ చేయించుకోవాలని, జీవిత కాలం సభ్యత్వం ఉన్న వారికి మినహాయింపు ఉందని, సభ్యత్వ నమోదు ఉచితమని తెలిపారు.
కొత్త గోరంట్ల దేవాలయంలో చోరీ
సత్తెనపల్లి: దేవాలయంలో చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం కొత్త గోరంట్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త గోరంట్ల గ్రామంలోని శివారున పొలాల సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య తండ్రి దేవస్థానంలో గుర్తు తెలియని దుండగులు తలుపు పగలగొట్టి రెండు పంచలోహ విగ్రహాలను, రూ.10 వేల నగదు అపహరించుకుపోయారు. ప్రతి శుక్రవారం, ఆదివారం దేవాలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన నంబూరు ఏడుకొండలు తలుపు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపల పరిశీలించాడు. రెండు పంచలోహ విగ్రహాలు, రూ.10 వేలు నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


