‘కిల్కారి’ నంబరును గర్భిణుల ఫోన్లలో సేవ్ చేయాలి
గుంటూరు మెడికల్: కిల్కారి కాల్ వచ్చే 911600403660 నంబరును గర్భిణులు, బాలింతల మొబైల్ ఫోన్‌లో తప్పనిసరిగా సేవ్ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి చెప్పారు. అలా నంబరు సేవ్ చేసినప్పుడు మాత్రమే గర్భిణులు తమకు ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కిల్కారి సేవలపై సమీక్ష జరిగింది. సమీక్షలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కిల్కారి కాల్స్ అందరికీ రావాలంటే ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో గర్భిణుల వివరాలు సకాలంలో, ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. కిల్కారి కాల్ వచ్చినప్పుడు పూర్తిగా సమాచారాన్ని వినే గర్భిణులు, బాలింతల సంఖ్యలో జిల్లాలో పెరిగేలా సూపర్‌వైజర్లు క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాల్నారు. ఏఎంసీ, పీఎంసీ సేవలు హైరిస్క్ గర్భం సూచనలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, బర్త్ ప్లాన్, రక్తహీనత, ప్రమాదకరమైన లక్షణాలు, టీకాలు, ఇలా ప్రతి గర్భిణీ, బాలింతకు కావాల్సిన ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని కిల్కారి కాల్ ద్వారా పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కిల్కారి కాల్ కార్యక్రమాన్ని గర్భిణి, బాలింతల కోసం ప్రవేశపెట్టిందన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇ.అన్నపూర్ణ, ఎన్‌సీడీ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డీపీహెచ్‌ఎన్‌ఓ ఇన్‌చార్జి డాక్టర్ కె.ప్రియాంక, రవికుమార్, సురేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి


