మాయా‘గాలం’
చలనం లేని అధికారులు
పాల్గొన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు
సాక్షి కథనంపై స్పందించిన కమిషనర్
యూఓ నోట్ జారీ
పనుల వివరాలు ఇవ్వాలని ఆదేశం
ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకూడదంటూ ఇంజినీరింగ్ అధికారుల నోటీసులు
దీనిపై హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు
కౌంటర్ కూడా వేయని అధికారులు
కాంట్రాక్టర్ల ముసుగులో తెలుగు తమ్ముళ్ల
టెండర్‌లలో వండర్‌లు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కాంట్రాక్టర్ల ముసుగులో తెలుగు తమ్ముళ్లు దొంగ టెండర్లు వేసి గుంటూరు నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. రూ. 10 కోట్లను దోచుకోవడానికి స్కెచ్ వేశారు. తెలుగు తమ్ముళ్లపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే అధికారులు ఎంత నిద్రావస్థలో ఉన్నారో స్పష్టంగా తేటతెల్లమవుతోంది. కార్యాలయంలో ఉద్యోగులు ఏదైనా చిన్న తప్పు చేస్తే సస్పెన్షన్‌తో పాటు వారి మీద కేసులు పెట్టి జైలులో వేయిస్తారు. మరి కోట్ల రూపాయలను లూటీ చేసిన వారిని ఎందుకు పట్టించుకోవడం లేదని కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ విషయం
గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు తమకే దక్కాలని ఉద్దేశంతో నగరపాలక సంస్థ కార్యాలయంలోని కొంత మంది ఉద్యోగుల అండతో తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. ఈ– ప్రొక్యూర్‌మెంట్ (టెండర్)లో పాల్గొనకుండానే వేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానికి నగర కమిషనర్ నుంచి ఆమోదం కూడా పొందారు. వర్క్ ఆర్డర్ కూడా తీసేసుకున్నారు. వర్కులు చేసుకుని బిల్లులు కూడా ప్రాసెస్ చేయించుకున్న విషయంపై సాక్షి దినపత్రికలో ఆగస్టు నెల 22వ తేదీన ‘‘రూ.కోట్లలో తమ్ముళ్ల లూటీ!’’ అనే కఽథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వెంటనే యూఓ (అర్జెంట్ ఆఫీస్) నోట్ ఇచ్చారు. ఇంత వరకు చేసిన వర్కుల వివరాలు, ఎంబుక్ వివరాలు, బిల్ పేమెంట్ వివరాలు 24 గంటల్లో తమకు సమర్పించాలని ఆగస్టు 23న ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీనిౖపై అధికారులు పూర్తి వివరాలతో కమిషనర్‌కు నివేదించారు.
తప్పును రైట్ చేసేందుకు అధికారుల కుస్తీ
అడ్డదారిలో టెండర్లు దక్కించుకుని నగరపాలక సంస్థకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింపజేసిన కాంట్రాక్టర్లకు సాక్షిలో వచ్చిన కథనంలో మింగుపడటం లేదనే చెప్పుకోవచ్చు. తప్పును రైట్ చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు కూడా గత్యంతరం లేక చేసిన పనికే మళ్లీ టెండర్లు పిలిచారు. వాటిల్లో ఎవరూ పాల్గొన వద్దంటూ వాట్సాప్ గ్రూప్‌లో కాంట్రాక్టర్లు మేసేజ్‌లు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంజినీరింగ్ అధికారులు, నగరపాలక సంస్థ పాలక వర్గంలో చలనం లేదు. కాంట్రాక్టర్లను కావాలనే కాపాడుతున్నారని వాదనలు మిగిలిన కాంట్రాక్టర్ల నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల ప్రమేయం లేకుండా ఇంత జరగదని చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులు, తెలుగు తమ్ముళ్ల్లపై ఎప్పటికి చర్యలు తీసుకుంటారో అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
తప్పు చేసిన కాంట్రాక్టర్లకు ‘‘మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు..ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకూడదంటూ’’ఇంజినీరింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. స్టే విధించి నెలలు గడుస్తున్నా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల్లో చలనం లేదు. కనీసం కౌంటర్ వేయలేదని సమాచారం. దీంతో తెలుగు తమ్ముళ్లు తమను ఎవరూ ఆపలేరంటూ రెచ్చిపోతున్నారు.
మాయా‘గాలం’


