ఖాకీలకు నిలువ నీడ కరువు | - | Sakshi
Sakshi News home page

ఖాకీలకు నిలువ నీడ కరువు

Nov 18 2025 6:17 AM | Updated on Nov 18 2025 6:17 AM

ఖాకీల

ఖాకీలకు నిలువ నీడ కరువు

ప్రశ్నార్థకంలో పోలీసులకు రక్షణ దాతల కోసం నిరీక్షణ త్వరలో కూల్చివేయనున్న ఓపీ పీఎస్‌ ఇప్పటికీ అద్దె భవనంలో కొత్తపేట పోలీస్‌స్టేషన్‌

అద్దె భవనంలో అగచాట్లు

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు జీజీహెచ్‌కు రక్షణ కవచమైన ఔట్‌పోస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ (ఓపీ పీఎస్‌)ను త్వరలో కూల్చివేయనున్నారు. రోజూ ఇక్కడకు వేలల్లో రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. వీరితో పాటు వైద్యలు, సిబ్బంది రక్షణ నిమిత్తం పోలీసులకు చిన్న గదిని మాత్రమే కేటాయించారు. అత్యవసర సేవల చికిత్సా విభాగం ఎదురున్న ఖాళీ స్థలాన్ని కేటాయించేందుకు ఆసుపత్రి వర్గాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అందులో ఓపీ పీఎస్‌ నిర్మాణం కోసం దాతల సహాయం తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీంతో పోలీసులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రహరీ కూల్చివేత

ఇటీవల శంకర్‌ విలాస్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పునః నిర్మాణ పనులు ప్రారంభించారు. విస్తరణలో భాగంగా జీజీహెచ్‌ అత్యవసర సేవల చికిత్సా విభాగం దగ్గరలోని ప్రహరీని కూల్చి నూతన నిర్మాణం చేపట్టారు. దీంతో అడ్డుగా మారిన ఓపీ పీఎస్‌ను తొలగించేందుకు జీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. పోలీసుల నుంచి అంగీకారం రాగానే క్షణాల్లో నేలమట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఓపీ పీఎస్‌లో క్రైం రికార్డులు, బీరువాలు, బెంచీలు, కమ్యూనికేషన్‌ విభాగపు సెట్‌ ఉందని, ఇటీవల కూల్చి వేసేందుకు వచ్చిన జీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై నగర కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులకు ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. దాతలు దొరక్క అవస్థలు పడుతున్నారు.

గతంలో దాతల సాయంతో నిర్మాణం

ప్రస్తుతం ఉన్న ఓపీ పీఎస్‌ను డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య జ్ఞాపకార్థం 2021లో నిర్మాణం ప్రారంభించారు. అప్పటి జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి 2021 మే 29న ప్రారంభించారు. లోపల మౌలిక సౌకర్యాలను కల్పించారు. దీంతో పోలీసులకు అనువుగా ఉండేది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఇతరత్రా నేరాలకు సంబంధించి క్షతగాత్రులు, మృతుల బంధువుల వద్ద వివరాల కోసం సుదూర ప్రాంతాల నుంచి పోలీసులు వస్తుంటారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే పోలీస్‌ ఉన్నతాధికారులు, పాలకులు సైతం వస్తారు. రోగులు, బాధితుల నుంచి ప్రమాద వివరాలను నమోదు చేసుకుంటారు. నేరాలకు సంబంధించి ప్రాథమిక నివేదిక రాసుకుంటారు. ఏలూరు, తూ.గో, ప.గో, వైజాగ్‌, కోస్తా, ఉమ్మడి జిల్లాల నుంచి పోలీసులు ఎమ్మెల్సీ కేసుల నిమిత్తం వస్తారు. ఈ సమయాల్లో ఇక్కడ ఓపీలోనే ఉంటారు. ఇక రాత్రివేళల్లో వచ్చే పోలీసులకు కాస్తంత సేద తీరేందుకు వెసులుబాటుగా ఉండేది. మళ్లీ ఓపీ పీఎస్‌ను కూల్చివేస్తే దాతల కోసం ఎదురుచూపులు చూడాల్సిందేనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

కిక్కిరిసిపోతున్న ఆస్పత్రి

వేల మంది రోగులతో ఆసుపత్రి వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు ఓపీ, ఐపీ విభాగాలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు మరింత రద్దీగా మా రతాయి. ఇక వైద్యాధికారులు, వైద్యులు, నర్సింగ్‌, ప్రైవేటు ఏజెన్సీల సిబ్బందితో కిటకిటలాడుతుంది. వేలాదిగా వచ్చే పోయే వారికి రక్షణగా, భద్రతగా కొత్తపేట స్టేషన్‌ పోలీసులు ఓపీ పీఎస్‌లో ఉంటున్నారు. మృతుల బంధువులు ఆందోళనలు, వార్డుల్లో మొబైల్‌ ఫోన్లు, నగదు, ఇతరత్రా చోరీలు, ప్రసూతి, పిల్లల విభాగాల్లో శిశువుల అపహరణ తదితర నేరాలను ఇక్కడ పోలీసుల అడ్డుకుంటారు. ఇటీవల ఎమర్జెనీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులపై దాడులకు ప్రయత్నించగా ఇక్కడ పోలీసులే కట్టడి చేశారు.

ఇప్పటికీ తూర్పు సబ్‌ డివిజన్‌లోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ అద్దె భవనంలో కొనసాగుతోంది. భాస్కర్‌ డీలక్స్‌ థియేటర్‌ రోడ్డులోని ఓ కాంప్లెక్స్‌లో సుమారు ఆరేళ్లుగా నడుస్తోంది. నెలనెలా అద్దె రూపేణా వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే, కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు గుంట గ్రౌండ్స్‌ సమీపాన సుమారు ఐదు వందల గజాల స్థలం ఉంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడిచినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాత స్థలంలో చెట్లు మొలిచాయి. ఇటీవల కొందరు పాత సామాన్లతో అక్రమించగా, వారిని ఖాళీ చేయించారు. పీఎస్‌, జీజీహెచ్‌ ఓపీ పోలీస్‌స్టేషన్ల నిర్మాణాలపై కలెక్టర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఖాకీలకు నిలువ నీడ కరువు 1
1/1

ఖాకీలకు నిలువ నీడ కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement