సంక్షేమ చట్టం– 2007 పై న్యాయ విజ్ఞాన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. వృద్ధులకు ఉన్న అన్ని రకాల చట్టాలు, వాటి ఉపయోగాలు, హాస్పిటల్స్, వృద్ధాశ్రమాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న వసతులు, సదుపాయాల గురించి వివరించారు. పారా లీగల్ వలంటీర్ ఎం.డి.రఫీ మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు గుంటూరులో సీనియర్ సిటిజన్స్‌కు న్యాయ పరమైన సలహాలు, సేవలు ఎలా అందుతాయో వివరించారు. ఎటువంటి సివిల్ సమస్యలైనా త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేసి న్యాయం అందేలా చేస్తామని తెలిపారు. గుంటూరు సీనియర్ సిటిజెన్‌న్స్ వెల్ఫేర్ ప్రెసిడెంట్ కై లాసనాధ్, సీనియర్ సిటిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ కె.వి.చలపతి రావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్‌కి ఎటువంటి సేవలు చేస్తున్నారో అలాగే ఇంకొంత సహాయ సహకారాలుంటే ఎలాంటి సేవలు చేయవచ్చో తెలిపారు. వారికి ఉన్న సమస్యలు గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్‌కి ఉన్న న్యాయపరమైన హక్కుల గురించి తెలిపారు. అందరూ అడిగిన సమస్యలకు సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రగతి వృద్ధాశ్రమం, ఉదయశ్రీ వృద్ధాశ్రమం, కొత్తపేట వృద్ధాశ్రమం నుంచి వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు ప్రత్తిపాడు లోని నవీన ఆదర్శ మహిళా మండలి వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులకు న్యాయపరమైన సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ మహిళామండలి స్టాఫ్, వృద్ధులు పాల్గొన్నారు.


