లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలను సహించం
కొమ్మమూరు కాలువ నుంచి నీటిని తరలిస్తే తప్పని నష్టం కూటమి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమిస్తాం కార్యాచరణ సమావేశంలో స్పష్టం చేసిన ఆయకట్టు రైతులు
కారంచేడు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయంతో కొమ్మమూరు కాలువ చివరి ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని, వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోకుంటే పోరాటం తప్పదని రైతులు ధ్వజమెత్తారు. గురువారం స్వర్ణ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రాంగణం, కుంకలమర్రు చెన్నకేశవస్వామి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యాచరణ సమావేశంలో వారు దీనిపై చర్చించారు. గుంటూరు జిల్లా కాకుమాను ప్రాంతానికి కొమ్మమూరు కాలువ నుంచి లిఫ్ట్ చేసి నీటిని తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన చెందిన రైతులు ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 పథకం ముసుగులో కొమ్మమూరు కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్న అప్పాపురం మొయిన్ చానల్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదనే సాకుతో కొమ్మమూరు కాలువ 60.25 కిలోమీటరు వద్ద కాలువ కుడి కట్టపై 120 హెచ్‌పీ హైస్పీడ్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించి సాగునీటిని తరలించడానికి తమకున్న పలుకుబడిని ఉపయోగిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కొమ్మమూరు దిగువ ఆయకట్టులోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 మండలాలు, 50 గ్రామాలకు చెందిన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. తాగు, సాగునీటిని పొందే దిగువ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని కోరారు.


