లారీని బైకు ఢీకొని ఇద్దరు మృతి
అతివేగమే ప్రమాదానికి కారణం
బాపట్ల టౌన్: లారీని బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున బాపట్ల గడియారస్తంభం సెంటర్‌లో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఆరుగురు యువకులు మూడు బైకులపై బుధవారం అర్ధరాత్రి సూర్యలంక సముద్రతీరానికి వెళ్లడానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో బీచ్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి బాపట్ల పట్టణానికి చేరుకున్నారు. వారిలో గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన షేక్ రిజ్వాన్ (18) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, చింతల నాని (21) గుంటూరు నగరంలోని వస్త్ర దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న బైకు అతివేగంతో చీరాల వైపు నుంచి బాపట్ల పాత బస్టాండ్ వైపు వెళుతున్న లారీ వెనక టైర్లను ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. షాక్‌కు గురైన మిగతా స్నేహితులు బోరున విలపించారు. గస్తీ పోలీసులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి సీఐ రాంబాబు చేరుకున్నారు. మృతదేహాలను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్‌ను కూడా విచారిస్తున్నామని పేర్కొన్నారు.


