బంగారం దుకాణాల్లో బీఐఎస్ అధికారుల సోదాలు
నకిలీ హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలు స్వాధీనం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలోని బంగారం దుకాణాల్లో గురువారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు బంగారు ఆభరణాల దుకాణాల్లో నకిలీ హాల్‌మార్క్ ముద్రిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న నేపథ్యంలో ఈ దాడులు చేశారు. లాలాపేట పరిధిలోని పలు దుకాణాల్లో హాల్‌మార్క్ లేజర్ మిషన్ ద్వారా 22కే, 916 ముద్రిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. బీఐఎస్ డైరక్టర్ అర్జున్ నేతృత్వంలోని సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా బీఐఎస్ డైరక్టర్ అర్జున్ మాట్లాడుతూ కొన్ని షాపుల్లో నకిలీ హాల్ మార్క్ వేసి బంగారం అమ్ముతునట్టు సమాచారం వచ్చిందన్నారు. నకిలీ మార్కు ఉన్న కేజీ 26 గ్రాముల బంగారాన్ని, లేజర్ మిషన్‌ను సీజ్ చేశామని తెలిపారు. కొనుగోలుదారులు హెచ్‌వైడీఅనే న్యుమారిక్ కోడ్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. గుంటూరులో మొట్టమొదటిగా షాపులను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కొంత మంది వ్యాపారులు లైసెనన్స్, హాల్‌మార్క్ లేకుండా అమ్మటంతోపాటు నకిలీ హాల్‌మార్క్ ముద్రిస్తున్నారని తెలిపారు. ఇది నేరమని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశారు.


