వణికిస్తున్న మోంథా తుపాను
ఆందోళనలో పశ్చిమ డెల్టా రైతులు వర్ష ప్రభావం.. తీవ్రంగా ఈదురు గాలుల హోరు
కీలక దశలో పలు పంటలు
తెనాలి: మోంథా తుపాను వణికిస్తోంది... అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది... తెనాలి ప్రాంతంలోని మాగాణి భూముల్లో కీలకదశలో ఉన్న వరిపైరు ఉసురు తీస్తుందేమోనని రైతులు బెంగ పడుతున్నారు. తుపాను కారణంగా కురిసిన వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో అక్కడక్కడా పైరు నేలవాలింది. తుపాను తీరం దాటే దశలో మరింత తీవ్రంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పంటకు మరింత నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరో 24 గంటలు ఎలాంటి ఉపద్రవం లేకుండా రోజు గడవాలని రైతులు కోరుకుంటున్నారు.
కంటిమీద కునుకు కరువు
తెనాలి డివిజను మొత్తం కలిపి 52.8 మిల్లీమీటర వర్షపాతం నమోదుకాగా, సగటున 6.6 మి.మీ వర్షం కురిసింది. కొల్లిపరలో 7.6, దుగ్గిరాలలో 6.4, తెనాలిలో 6.0 వర్షంపాతం నమోదైంది. వర్షం తక్కువగా అనిపించినా, మధ్యాహ్నం నుంచి ఈదురుగాలుల తీవ్రత హెచ్చింది. దీనితో కొల్లిపర మండలంలో తూములూరు, దావులూరు ప్రాంతాల్లో అక్కడక్కడా వరిపైరు పడిపోయింది. వాయుగుండం మంగళవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందన్న సమాచారంతో రాత్రికి భారీవర్షాలు, గాలుల తీవ్రత పెరుగుతుందన్న హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. పంటకాల్వలు రెండు రోజుల క్రితమే కట్టేసినందున ప్రస్తుత వర్షాలకు చేలల్లో నీరు నిలవటం లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రత్తిపాడు: మోంథా ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కర్షకుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా, వీస్తున్న ఈదురుగాలులు అన్నదాత వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గుంటూరు డివిజన్‌లోని గుంటూరు ఈస్ట్, వెస్ట్, పెదకాకాని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో సుమారుగా పత్తి 13,078 ఎకరాల్లో, వరి 10,703 ఎకరాల్లో, మిర్చి 1,712 ఎకరాల్లో, మినుము 596 ఎకరాల్లో, పసుపు 171 ఎకరాల్లో సాగులో ఉండగా ఇతర పంటలు సుమారు రెండు వేల ఎకరాల్లో ఉన్నాయి. వరిపై తుపాను ప్రభావం కనిపించనప్పటికీ, పత్తి, మిర్చి, మినుము పంటలపై తీవ్రంగా పడనుంది. మిర్చి పంటలో నీరు నిలబడితే మొక్క వేరు ద్వారా పోషకాలను తీసుకోలేదు. ఫలితంగా పంటను పురుగులు, తెగుళ్ల ఆశిస్తాయి. అంతేకాకుండా సూక్ష్మధాతు లోపం కూడా అధికంగా కనిపిస్తుంది.
పంటల పరిశీలన..
ప్రత్తిపాడు, పాతమల్లాయపాలెం గ్రామాల్లో మంగళవారం వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు శాస్త్రవేత్తలు పర్యటించారు. ఆయా గ్రామాల్లో సాగు చేసిన పత్తి, మిర్చి పంటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి బి. రవీంద్రబాబు, లాం ఫాం పీఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సి.శారద, ప్రత్తిపాడు ఏవో షేక్ సుగుణ బేగంలు పరిశీలించారు.
తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలో గల సబ్ డివిజనులో వరి 50,586 ఎకరాల్లో సాగుచేశారు. మినుములు 2,004 ఎకరాలు, మెట్టపొలాల్లో అరటి 1,456, పసుపు 1,921 ఎకరాల్లో వేశారు. మరో 597 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. మొత్తం మీద వ్యవసాయ పంటల విస్తీర్ణం 52,721 ఎకరాలు కాగా, ఉద్యాన పంటలు 6,721 ఎకరాల్లో ఉన్నాయి. వరి పైరు బిర్రుపొట్ట, పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ముందుగా వెదజల్లిన కొల్లిపర మండలంలో మరో రెండు వారాల్లో పైరు కోతకు వస్తుంది. అరటి, పసుపు పంటలు కూడా కీలక దశలో ఉన్నాయి. గాలులు, అధిక వర్షాలకు కూరగాయల పంటలతో సహా అన్ని పంటలకు నష్టం కలిగే ప్రమాదముంది.


