బాధ్యత గల పౌరులుగా ఎదగాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి ఘనంగా ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవం
మంగళగిరి టౌన్: ఉన్నత విద్య పూర్తిచేసిన ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి సూచించారు. మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచస్థాయి సంస్థల్లో కీలకపాత్ర పోషించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. వర్సిటీ ఫౌండర్ చాన్స్‌లర్ డాక్టర్ టి.ఆర్.పారివేందర్ మాట్లాడుతూ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. డిగ్రీలు అందుకున్న విద్యార్థులు వర్సిటీకి మంచిపేరు తీసుకురావాలని కోరారు. అనంతరం 2020–2025లో బీటెక్, పీహెచ్‌డీ, బీఏ, బీకాం పూర్తిచేసుకున్న 1,877 మంది విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబర్చిన వారికి బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


