అప్రమత్తంగా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
మంగళగిరి టౌన్: తుఫాన్ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. తాడేపల్లి మండలం ఇప్పటం, రాధా రంగా నగర్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంగళవారం అధికారులతో కలసి ఆమె పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాలను పరిశీలించిన జేసీ..
మంగళగిరిలోని లోతట్టు ప్రాంతాల్లో, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పర్యటించి పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, అడిషనల్ కమిషనర్ శకుంతల, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర పాల్గొన్నారు.
ప్రత్తిపాడు, పెదనందిపాడుల్లోని పునరావాస
కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ప్రత్తిపాడు: తుపాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. మంగళవారం ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జెడ్పీ హైస్కూల్, పెదనందిపాడు బాలుర వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలతో పాటు ప్రభావిత ప్రాంతాలను ఎస్పీ స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లును పంపిణీ చేశారు. అనంతరం భోజనం వడ్డించారు. అనంతరం నల్లమడ వాగు, గుంటూరు– పర్చూరు పాతమద్రాసు రోడ్డులోని లోలెవల్ చప్టాలు, వంతెనలు, నేలవాగులను పరిశీలించారు. తుపాను తీవ్రతో కురిసే భారీ వర్షాలకు ఆయా లోలెవల్ చప్టాలు ఉప్పొంగే ప్రమాదం ఉందని, అందుచేత ఆయా ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


