భర్తను హతమార్చిన భార్య అరెస్ట్
ఈ ఏడాది జూన్ 19న దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య సాధారణ మరణంగా చిత్రీకరించే యత్నం పోస్టుమార్టం రిపోర్టుతో గుట్టురట్టు వివరాలు వెల్లడించిన పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): భర్తను హతమార్చిన భార్యను అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గంగా వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. గుంటూరు నేతాజీనగర్ ఆరవ లైనుకు చెందిన షేక్ ఖాజా అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన హజారాను 2008లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి అమ్మాయి, అబ్బాయి సంతానం ఉన్నారు. ఖాజా ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. భార్య హజారా గుజ్జనగుండ్ల సెంటర్‌లో బ్యూటీపార్లర్ నడుపుతుంది. గత కొంతకాలంగా భార్యభర్తల నడుమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈ ఏడాది జూన్ 19వ తేదీ రాత్రి ఖాజా మద్యం సేవించి వచ్చి హజారాతో గొడవపడి కర్రతో కొట్టి, చున్నీతో ఆమె మెడకు బిగించి హతమార్చేందుకు యత్నించగా హజారా విడిపించుకుని సోఫాలో కూర్చుంది. సోఫాలో కూర్చున్న హజారా ముఖంపై సోఫా దిండుతో అదిమిపెట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఈక్రమంలో తన భర్త పెట్టే బాధలు భరించలేక అతన్ని ఎలాగైనా హతమార్చేందుకు నిశ్చయించుకున్న హజారా అదేరోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన బెడ్‌రూమ్‌లో మద్యం మత్తులో ఉన్న భర్త ఖాజాను సోఫా దిండుతో ముఖం అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. ఖాజా ఊపిరి ఆడక, కళ్లు తేలేసి స్పృహ కోల్పోయాడు. ఈక్రమంలో ఏమీ ఎరుగనట్లుగా బయటకు వచ్చిన హజారా పక్క వీధిలో ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు వచ్చి తన భర్త ఖాజా కింద పడిపోయాడని చెప్పింది. తన భర్త పడిపోయి, కళ్లు తేలేశాడని తెలిపింది. ఈక్రమంలో ఖాజాను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఖాజా కుటుంబ సభ్యులు అతని మరణం పై అనుమానం ఉందని, జూన్ 20వ తేదీన పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి వైద్యులు ఈనెల 26వ తేదీన ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఖాజాను ఎవరో దిండుతో హతమార్చినట్లు గుర్తించి, హజారాను ఈనెల 27న అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా.. భర్త వేధింపులు తాళలేక హతమార్చినట్లు అంగీకరించింది. దీంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు హజరాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.


