మోంథా గుబులు
పోలీస్ సబ్ డివిజన్ల వారీగా కంట్రోల్ రూం నంబర్లు ఇవే.
కొరిటెపాడు(గుంటూరు): వాయు గుండం మోంథా తుఫాన్‌గా మారి జిల్లాలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో గుబులు రేగుతోంది. తుఫాన్ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండనుందన్న వార్తలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల వరి పొట్ట దశలో, మరికొన్ని చోట్ల కంకి దశలో, పత్తి, మినుము కాయ, పిందే దశలో ఉన్న ఈ నేపథ్యంలో తుఫాన్ హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకొని చిరుజల్లులు పడుతున్నాయి. వాహన చోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారుల సూచనలతో అన్నదాతలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లా కలెక్టర్ పర్యటన..
తెనాలి: గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం మోంథా తుఫాన్ ప్రభావిత తెనాలి డివిజనులో విస్తృతంగా పర్యటించారు. తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి తొలుత రూరల్ మండల గ్రామం కొలకలూరులోని బకింగ్‌హామ్ పంటకాల్వను, నందివెలుగులో నిజాంపట్నం, తూర్పు, పశ్చిమ కాల్వలను పరిశీలించారు. కొల్లిపర మండలంలోని అత్తోట కూడలి వద్ద పంట పొలాలు, పంట కాల్వలను పరిశీలించినపుడు, కొందరు కాల్వను ఆక్రమించుకోవటంతో నీటిపారుదల సక్రమంగా జరగక, అధిక వర్షాల సమయంలో పొలాల్లోకి వరదనీరు చేరుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వల్లభాపురం వద్ద పంట కాల్వలను పరిశీలన సందర్భంగా పంట కాల్వల కారణంగా పంటచేలు ముంపునకు గురికాకుండా ఎత్తిపోతల ఆవశ్యకతను స్థానిక రైతులు విన్నవించారు. తుఫాన్ కారణంగా కురిసే వర్షాలు, వీచే గాలులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు, రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని చెప్పారు. పంటకాల్వల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దుగ్గిరాల మండల గ్రామం పెదకొండూరు వద్ద 650 మీటర్ల రహదారి పనులు దీర్ఘకాలంగా నిలిచిపోయిన విషయాన్ని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీనితో కలెక్టర్ తమీమ్ అన్సారియా వెంటనే రహదారి పనులను ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, మంగళగిరిలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. వసతులు సరిగా ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించారు. సంచార జీవనం సాగిస్తున్నవారు, తాత్కాలిక గుడారాలు, ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాల్లో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వసతి, మరుగుదొడ్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి, జలవనరులశాఖ పర్యవేక్షక ఇంజినీరు పి.వెంకటరత్నం, జిల్లా మత్స్యశాఖ అధికారి పీఎన్ కిరణ్‌కుమార్, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూంలు ఏర్పాటు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : మోంథా తుఫాన్ దష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం పోలీస్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదకరమైన వంతెనలు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద ఎటువంటి ప్రాణపాయం జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అత్యవసర స్పందన బృందాలను నియమించామని చెప్పారు. జిల్లాలోని ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం బయటకు రావాలన్నారు. తుఫాన్ ప్రభావితమైన ప్రాంతాలు, ముంపు గ్రామాలను ముందస్తుగా గుర్తించామని చెప్పారు. సంబంధిత శాఖల అధికార, సిబ్బందితో సమన్వయం చేస్తూ, పూర్తిస్థాయిల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి కంట్రోల్ రూంకు డీఎస్పీ నోడల్ అధికారి అని, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది విధుల్లో డీఎస్పీ పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.
గుంటూరు తూర్పు సబ్ డివిజన్ – 0863–2223353 గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ 0863–2241152 / 0863–2259301 ఉత్తర సబ్ డివిజన్ 08645–237099
దక్షిణ సబ్ డివిజన్
0863–2320136
తెనాలి సబ్ డివిజన్
08644–225829
తుళ్లూరు సబ్ డివిజన్
08645–243265
జిల్లా పోలీస్ కంట్రోల్ రూం 0863–2230100
మోంథా గుబులు


