పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసియున్న నాగుల గుడి దేవస్థానంలో సోమవారం కార్తిక శుద్ధ షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ, కావడి ఊరేగింపు నిర్వహించారు. ఉదయం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అలాగే శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. స్వామివారిని ఆదిశేష వాహనంపై విశేష అలంకరణతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగుల గుడి దేవస్థానం నుంచి పట్టణంలోని జానపాడు రోడ్డులో వేంచేసియున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు భక్తులు కావడి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ దేవస్థాన అర్చకులు వెంకటేశ్వర శర్మతోపాటు దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
మిర్చి యార్డుకు సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యం, ఉన్నతాధికారుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ, విక్రయాలు జరగబోవని వెల్లడించారు. రైతులు సెలవు రోజుల్లో తమ మిర్చిని యార్డుకు తీసుకురావద్దని కోరారు.
యలమంచిలిని పరామర్శించిన హైదరాబాద్ మాజీ మేయర్
గుంటూరు ఎడ్యుకేషన్: రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీని హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల వెంకట కృష్ణారెడ్డి సోమవారం పరామర్శించారు. అస్వస్థతకు గురై, చికిత్సానంతరం గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న శివాజీని వెంకట కృష్ణారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుకున్నారు.
30న వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం
వినుకొండ : పల్నాడు జిల్లా వినుకొండ శ్రీనివాస నగర్‌లోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం తృతీయ వార్షికంగా శ్రీవారి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అన్నదాన ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ల రామకోటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఆర్‌ఎంగా సామ్రాజ్యం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు రీజియన్ మేనేజర్‌గా డి.సామ్రాజ్యం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా ఆర్‌ఎంగా పనిచేస్తున్న సామ్రాజ్యం పదోన్నతిపై గుంటూరు రీజియన్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్‌ఎంగా పనిచేసిన సి.హెచ్.విమల బాపట్ల జిల్లాకు ప్రజా రవాణా అధికారిగా వెళ్లారు. ఆర్‌ఎం సామ్రాజ్యంకు సిబ్బంది, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
వైభవంగా కావడి ఊరేగింపు
వైభవంగా కావడి ఊరేగింపు
వైభవంగా కావడి ఊరేగింపు


