తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేశారని పీఆర్‌ఓ వినయ్‌కాంత్ సోమవారం రాత్రి తెలిపారు. రైలు నంబర్ 12806 లింగంపల్లి–విశాఖ రైలు, 17281 గుంటూరు–నరసాపూర్, 17016 సికింద్రాబాద్–భువనేశ్వర్, 12704 సికింద్రాబాద్ –హౌరా, 17243 గుంటూరు –రాయగడ, రైళ్లు ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపారు. రైలు నంబర్ 17244 రాయగడ–గుంటూరు రైలు ఈనెల 29వ తేదీన తాత్కాలిక రద్దు చేశారన్నారు.
వారాంతపు ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్టు పీఆర్‌ఓ వినయ్‌కాంత్ సోమవారం రాత్రి తెలిపారు.
నల్లమడ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన జేసీ
ప్రత్తిపాడు: మోంథా తుపాను నేపథ్యంలో పెదనందిపాడు మండలంలోని నల్లమడ ముంపు ప్రాంతాన్ని సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శ్రీవాస్తవ పరిశీలించారు. నల్లమడ వాగుతో పాటు పరిసరాల్లో ఉన్న నివాసాలను పరిశీలించిన ఆయన స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. నల్లమడ వాగు కట్టపై నివసిస్తున్న ప్రజలను సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించాలని అదేశించారు. కేంద్రాల్లో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను దృష్ట్యా ఇప్పటికే నల్లమడ వాగు సమీపంలో ఉన్న నలభై కుటుంబాలను పెదనందిపాడులోని ఎస్సీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని అధికారులు జేసికి వివరించారు.


