మత్స్యకారుల వలవిల
చీరాల టౌన్: తీరం వెంట హైలెస్సో.. హైలెస్సో అంటూ గంగపుత్రులు ఉత్సాహంగా మొదలు పెట్టే వేట ప్రస్తుతం ఆపసోపాల మధ్య సాగుతోంది. తుపాన్ల కారణంగా వర్షాలు కురుస్తుండటంతో వేట సాగక మత్స్యకారుల బతుకులు భారంగా మారాయి. మత్స్యకారులు వరుస తుపాన్లతో సతమతమవుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గంలో కొంత సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంట అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 50 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. తీరప్రాంత గ్రామాల్లో 1549 ఇంజన్ బోట్లు, 2,283 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. తీర ప్రాంతాల్లో 20 వేలు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నెలన్నర నుంచి తుపాన్లు, భారీ వర్షాలతో గంగపుత్రులు పూట గడవక ఆపసోపాలు పడుతున్నారు. వేట ప్రస్తుతం ప్రకృతి విపత్తులతో ఆగిపోతుంది. ఫలితంగా తీరం ఒడ్డున బోట్లు, వలలను నిలుపుదల చేసి అర్ధాకలితో అలమటిస్తున్నారు.
వరుస విపత్తులతో సాగని వేట..
ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో సముద్రంలో మత్య్స సంపద అధికంగా లభిస్తుంటుంది. చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం, కఠారిపాలెం నుంచి మత్స్య సంపదలను బెంగళూరు, కలకత్తా, చైన్నె, విజయవాడ, కేరళ, ఈరోడ్, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. గత నెల నుంచి సముద్రంలో వేట సరిగా లేకపోవడంతో మత్స్య ఉత్పత్తులు ఎగుమతి లేకుండా పోయింది. ఒక్కో బోటుకు ఆరుగురు చొప్పున మత్స్యకారులు డీజిల్ పోయించుకొని రూ.20 వేలు ఖర్చు చేసి వేటకు వెళ్లినా కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..
వేటతప్ప మరో పని తెలియని గంగపుత్రులు గత రెండు నెలలుగా తుపాన్లు కారణంగా వేట సాగక పూటగడవక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం స్పందించి గంగపుత్రలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తుపాన్ల సమయంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


