రెస్క్యూ ఆపరేషన్‌లకు సిద్ధం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ సౌత్ జోన్ ఏడీ జ్ఞానసుందరం చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంను సోమవారం ఆయన పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో పరికరాల పనితీరు. సిబ్బంది శిక్షణ మొదలగు అంశాలను పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ సిబ్బంది యంత్రాలతో పని చేసే విధానాన్ని స్వయంగా చూశారు. ఈ సందర్భంగా ఏడీ జ్ఞానసుందరం మాట్లాడుతూ సౌత్ రీజియన్ పరిధిలో 17 బోట్లు ఉన్నాయని తెలిపారు. ట్రీ కటింగ్ మిషన్‌లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. పూర్తిస్థాయిలో రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచామని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారి సేవలు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సిబ్బందికి సైతం లైఫ్ జాకెట్లు, బ్రీతింగ్ సూట్లు, ఇతర పరికరాలను వారి రక్షణ కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. రీజినల్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌వో) ఎంక్యూ జిలాని మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆయా అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. కచ్చితంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా.. అధికారులు నుంచి, ప్రజల నుంచి ఎటువంటి సమాచారం అందినా.. రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


