పులి వీరంగం!
మేయర్‌నూ నియంత్రించేలా...
ఎక్స్‌ట్రాలు మాట్లాడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్.. అంటూ డిప్యూటీ మేయర్‌కు వార్నింగ్
‘ఎక్స్‌ట్రాలు మాట్లాడొద్దు.. కంట్రోల్ యువర్ టంగ్’... ఇవీ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరికలు. అదీ ఏకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబుపై చేసిన వ్యాఖ్యలు. అదీ ఎందుకంటే... గుంటూరు నగర నడిబొడ్డున రూ.వందల కోట్లు విలువ చేసే నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు ఇలా వార్నింగ్ ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్: నగర పాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం గురువారం మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ప్రారంభమైంది. తొలుతే నార్ల ఆడిటోరియం వైఎస్సార్‌సీపీ సభ్యులు వ్యతిరేకించారు. ముందుగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఆర్థికంగా బలంగా ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లో రూ.6 కోట్ల కోసం విలువైన ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. ప్రజల పన్నులతో నగర అభివృద్ధి జరుగుతోందని గుర్తుచేశారు. అటువంటి నగరపాలక సంస్థ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా నార్ల ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ నార్ల ఆడిటోరియాన్ని పీపీపీ మోడ్‌లో అన్నమయ్య ట్రస్ట్‌కు కట్టబెట్టేందుకు అర్హతలు ఏంటి, ఓపెన్ ఆక్షన్ పెడితే బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. అలా కాకుండా కేవలం ఒక్క అన్నమయ్య ట్రస్ట్‌కే ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సదరు ట్రస్ట్ బాలాజీ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తూ ఒక్కో ఫంక్షన్‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తోందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆడిటోరియాన్ని ఫినిషింగ్ పెండింగ్ ఉందని రూ.6 కోట్ల కోసం అన్నమయ్య ట్రస్ట్‌కు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలు అక్కడ ఫంక్షన్లు చేసుకునే అవకాశం ఉండదన్నారు. దీనిని కార్పొరేషన్ నిర్మించి, నిర్వహణ బాధ్యత కూడా జీఎంసీ చూడాలని మరో కార్పొరేటర్ షేక్ రోషన్ డిమాండ్ చేశారు.
కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఆగ్రహం
అన్నమయ్య సేవా సమితి సభ్యులకు నార్ల ఆడిటోరియాన్ని అప్పగించేందుకు కార్పొరేషన్‌కు ఉన్న అధికారాలు ఏంటి?, లీజుకు ఇవ్వొచ్చా? అద్దెకు ఏ ప్రతిపాదికన ఇవ్వొచ్చు? కస్టోడియల్ రైట్స్ ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం లేకుండా కౌన్సిల్ పెట్టి పాస్ చేయండి అని అడిగితే.. తాము దీనికి పూర్తి వ్యతిరేకమంటూ తన డిసెంట్‌ను రికార్డ్ చేయాలని కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకు ఇచ్చారు. అదే క్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా.. ‘నేను తీసుకోను.. అధికారులకు డిసెంట్ ఇచ్చే అధికారం సభ్యులకు లేదు.. మేయర్‌కు మాత్రమే ఇవ్వాలని. అవసరమైతే కమిషనర్ చాంబర్‌లో కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. ‘నువ్వెలా డిసెంట్ తీసుకుంటావు.. ఇచ్చేయ్’ అంటూ కౌన్సిల్ సెక్రటరీపై కమిషనర్ ఊగిపోతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు డిసెంట్ ఇవ్వకూడదని రాసివ్వాలని కమిషనర్‌ను డిప్యూటీ మేయర్ కోరారు.
మేయర్ రవీంద్ర సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేస్తుండగా ‘మీరు ఉండండి..’ అంటూ మేయర్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కమిషనర్. ఈ క్రమంలోనే మేయర్, కౌన్సిల్ సెక్రటరీ పాత్రలను కూడా కమిషనర్ చేస్తున్నారని డిప్యూటీ మేయర్ విమర్శించారు. ఈ క్రమంలో ‘ఎక్స్‌ట్రాలు మాట్లాడకు.. కంట్రోల్ యువర్ టంగ్’ అంటూ తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలా మాట్లాడటం తగదని అన్నారు. సభ్యులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు వ్యతిరేకించినా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.


