ఆచార్యా... ఇంత నిర్లక్ష్యమా?
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ పరీక్షల తీరు, ఫలితాల విడుదలపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండవ సెమిస్టర్ ఫలితాలను ప్రకటించామని వర్సిటీ అధికారులు పత్రికాముఖంగా తెలిపారు. అక్టోబర్ 23వ తేదీని పునఃమూల్యాంకనం (రీవాల్యుయేషన్)కు చివరి తేదీగా పేర్కొన్నారు. గతంలో ఫలితాలు ప్రకటించిన రోజునే మార్కులు వెబ్‌సైట్‌లో పొందుపరిచేవారు. రీవాల్యూయేషన్ చివరి తేదీ ముగిసినా వెబ్‌సైట్‌లో నేటికీ మార్కులు పెట్టకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 507 మంది పరీక్షలు రాయగా 357 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ అధికారులు ప్రకటించారు. విద్యార్థులకు ఆ ఫలితాలు అందకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఫొటోగ్రఫీ ఇన్ డిప్లమో, లా కళాశాలల వారి ఫలితాల విషయంలోనూ అధికారులు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారు. పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత ఉద్దేశపూర్వకంగానే మార్కులు వెబ్‌సైట్‌లో పొందుపరచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనూ ఇదే సమస్య
పరీక్ష ఫలితాల విడుదలలో ఇలా నిర్లక్ష్యంగా ఉండటం వర్సిటీ అధికారులకు కొత్తేమీ కాదని... గత 14 నెలలలో తాత్కాలిక అధికారుల హయాంలో పలుమార్లు ఇలా జరిగాయని విద్యార్థులు అంటున్నారు. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు వెంటనే విద్యార్థులకు ఫలితాలు తెలియజేయడం గమనార్హం. గడువు దగ్గర పడటంతో మార్కులు తెలుసుకునేందుకు విద్యార్థులు వర్సిటీకి పరుగులు తీస్తున్నారు. సంబంధిత సిబ్బందిని సంప్రదించగా మార్కులు చెప్పేందుకు కూడా కొందరు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు మౌనం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


