వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
తాడికొండ: గుంటూరు నగరంలో, జిల్లాలోని వివిధ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గురువారం పర్యటించారు. ఉదయం నుంచి వర్షాలు విస్తృతంగా కురవడంతో లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మూడు వంతెనలు వద్ద, బ్రాడీపేట నాలుగవ లైన్ మీదుగా పట్టాభిపురం అండర్ వే బ్రిడ్జి (కంకర గుంట బ్రిడ్జి) వద్దకు వెళ్లారు. జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. మురుగు నీటి వ్యవస్థను మరింత పక్కాగా నిర్వహించాలని సూచించారు. అక్కడి నుంచి నంబూరు వద్ద బుడంపాడు కాలువను, గుంటూరు చానెల్, గుంటూరు నల్లాను పరిశీలించారు. నంబూరు గ్రామానికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కంతేరు రోడ్ అండర్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. ఎర్రవాగు, కంతేరు వాగు, కోటెళ్లవాగులను పరిశీలించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం
గుంటూరు వెస్ట్: మండలంలో ప్రతి రెవెన్యూ అంశం తహసీల్దార్‌లకు తెలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. తెనాలి రెవెన్యూ డివిజన్ అధికారుల సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలపై ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి అంశంలో తహసీల్దార్లు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రతి అంశంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని స్పష్టం చేశారు.


