మెడికవర్ హాస్పటల్స్‌తో ఆదిత్య హాస్పటల్ భాగస్వామ్యం
గుంటూరు మెడికల్: గుంటూరులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒకటైన ఆదిత్య హాస్పటల్ అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాల్లో గుర్తింపు పొందిన యూరోపియన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ మెడికవర్ హాస్పటల్స్‌తో కీలక భాగస్వామ్యంఏర్పాటు చేసుకుంది. ఈమేరకు బుధవారం బుడంపాడులో నూతనంగా నిర్మించిన హాస్పటల్‌లో ఇరు ఆసుపత్రుల యజమాన్యాలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రెండు ఆసుపత్రుల కలయిక గుంటూరు, పరిసర జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, సాంకేతికత పెంపుదలకు దోహదపడుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. గుంటూరులో 2018లో స్థాపించబడిన ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పటల్స్, నేడు 350 పడకలతో ఏటుకూరు – బుడంపాడు మధ్య జాతీయ రహదారిపై నిర్మిత మైందన్నారు. ఈ ఆస్పత్రిని నవంబరు 27న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్ని వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటీవల డాక్టర్ హనుమ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ సేవలను ప్రవేశపెట్టామన్నారు. ఆదిత్య హాస్పటల్స్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అముల్య మాట్లాడుతూ మెడికవర్ భాగస్వామ్యంతో గుంటూరులో అంతర్జాతీయ ఆధునిక చికిత్సలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదిత్య హాస్పిటల్స్ డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ తమ ఆస్పత్రిలో రోబోటిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు అందుబాటులో తెచ్చామన్నారు.
మెడికవర్ హాస్పటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంతో అత్యాధునిక వైద్యం లభిస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలోని ప్రతి నగరానికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.


