స్మార్ట్‌సిటీ కార్మికులకు పెండింగ్ జీతాలను చెల్లించాలి
తాడికొండ: రాజధాని అమరావతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ ఉన్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వెంటనే చెల్లించాలని రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఆర్డీఏ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రవి మాట్లాడుతూ పెండింగ్ జీతాలు కోరుతూ ఈనెల 10వ తేదీన తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని గ్రామాలలోని పారిశుద్ధ్య కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అదేరోజు రాత్రి ఏజెన్సీ నిర్వాహకులు ఆగస్టు నెల జీతాన్ని కార్మికుల అకౌంట్లలో జమ చేశారన్నారు. కానీ సెప్టెంబర్ పెండింగ్ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని కోరగా 13వ తేదీన కొందరు కార్మికులకు మాత్రమే జమ చేసి, చాలామందికి వేయలేదన్నారు. ఈ విషయాన్ని సీఆర్‌డీఏ అధికారులు, ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ మండిపడ్డారు. కార్మికులకు పెండింగ్ ఉన్న జీతాలు చెల్లించే విషయంలో ఏజెన్సీ సాకులు చెప్పడం మాని వెంటనే వారి అకౌంట్లో పెండింగ్ జీతాన్ని జమ చేయాలని రవి డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్షురాలు సిహెచ్ సుశీల, నాయకులు ఎన్.వీర లంకమ్మ, వి.బుజ్జి, జె.లక్ష్మీ తిరుపతమ్మ, ఎం.మేరీ, కె.అరుణ్ కుమార్, మాలతి, పి.రూతమ్మ, జి.మల్లేశ్వరి, మధురవాణి, చలివేంద్రం జయమ్మ, జయమేరి తదితరులు పాల్గొన్నారు.
రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం
గౌరవాధ్యక్షుడు ఎం.రవి


