
సహకారంలో జీతాల కుంభకోణం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 167 సొసైటీలు లాభాల్లో ఉన్న సొసైటీలు 67 నష్టాలలో ఉన్న సొసైటీలకు పెంపుదల వర్తింపు జీతాల అరియర్స్ కోసం లక్షకు 30శాతం మామూళ్లు డిపార్టుమెంట్ పర్సన్ ఇన్‌చార్జి టైమ్‌లో నకిలీ బిల్లులు పెట్టి ఖర్చులు రాసుకున్నారు.. విచారణ చేస్తే బయటపడనున్న కుంభకోణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో పర్సన్ ఇన్‌చార్జులు కుంభకోణానికి తెరలేపారు. నష్టాలలో ఉన్న సొసైటీలలో కూడా జీతాలు పెంచేశారు. జీతాల అరియర్స్ కోసం లక్షకు రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 167 సొసైటీలు ఉన్నాయి. అందులో 100 సొసైటీల వరకు నష్టాలలో నడుస్తున్నాయి. మిగిలిన 67 సొసైటీలు మాత్రమే లాభాలలో ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల జీతాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ కింద జీఓ జారీ చేసింది. దీనికి జిల్లాలో డీఎల్‌ఈసీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్‌న్ వ్యవహరిస్తుండగా, డీసీసీబీ సీఈవో కన్వీనర్‌గా, జిల్లా సహకార అధికారులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయాలన్నా ఈ కమిటీలో చర్చించి చేయాలి. అలాగే సొసైటీ సిబ్బంది జీతాలు పెంచాలంటే ఈ కమిటీ ఆమోదం కావాలి. మూడేళ్లుగా అనేక జిల్లాల్లో సొసైటీ కమిటీతో ప్రపోజల్ పంపించమని అడిగి డివిజనల్ సహకార అధికారులు సొసైటీ సిబ్బంది జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇందులో నష్టాలలో ఉన్న సొసైటీల సిబ్బందికి కూడా జీతాలు పెంచేశారు. ఈ క్రమంలో జీతాల అరియర్స్ చెల్లించడం కోసం డిపార్టుమెంట్ వారు లక్షకు 30 శాతం మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది సర్వీస్ రిజిస్టర్ ప్రకారం డిపార్ట్‌మెంట్, బ్యాంక్ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి వారికి ఎన్ని ఇంక్రిమెంట్‌లు ఇవ్వాలి, అంత పే ఫిక్సేషన్ చేసి డీసీసీబీ ద్వారా అరియర్ జీతాలు పెంచాలి. ఇవి అంతా డీసీసీబీలో జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందాలి.
పర్సన్ ఇన్‌చార్జుల ఇష్టారాజ్యం
అయితే కొందరు సహకార అధికారులు పర్సన్ ఇన్‌చార్జిగా పనిచేసిన కాలంలో ఒక్కో సొసైటీలో ఇష్టారాజ్యంగా ఎక్కువగా పెంచేశారు. కొన్ని సొసైటీలలో ఒక సంవత్సరానికి రెండు, మూడుసార్లు జీతాలు పెంచుతూ పాత బకాయిలు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ ఇచ్చేశారు. దీని కోసం డిపార్టుమెంట్ పర్సన్ ఇన్‌ఛార్జులు పాత బకాయిలను మామూళ్ల కింద తీసుకుని పెంచిన జీతం మాత్రం ఉద్యోగులకు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్‌మెంట్ పర్సన్ ఇన్‌చార్జిలు గత ఏడాదిన్నర కాలంగా ఇటీవల కొత్త కమిటీలు వేసే వరకూ సొసైటీలలో అధిక మొత్తంలో కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు రాసేసుకుని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇవన్నీ పరిశీలించాలంటే 2024 మార్చి 31 నుంచి ఈ ఏడాది మార్చి 31కి, ఆగస్టు 10 వరకూ అంటే కొత్త కమిటీలు బాధ్యతలు తీసుకునే వరకూ కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు, సిబ్బంది జీతాలు ఎన్నిసార్లు పెంచారో, దానికి ఎంత చెల్లించారో పరిశీలిస్తే అన్ని వాస్తవాలు బయట పడతాయి. ఇటీవల నూతన కమిటీలు 10 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటాయని తెలిసిన వెంటనే వారు సిబ్బందికి జీతాలు పెంచేసినట్లు సమాచారం.
నిబంధనలు తుంగలో తొక్కి...
నాబార్డు నిబంధనలు ప్రకారం వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలు వస్తే జీతాలు పెంచడానికి వీలులేదు. సీఆర్‌ఎఆర్ 12 శాతం మించి వుండాలి, కానీ ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాసులకు అలవాటు పడి డిపార్ట్‌మెంట్ సిబ్బంది జీతాలు పెంచేశారు. ఒక్కొక్క సొసైటీలో ఇవ్వవలసిన దాని కన్నా ఎక్కువ ఇచ్చేశారు. ఉదాహరణకు బాపట్ల జిల్లా నగరం మండలంలో నగరం పీఎసీఎస్ రూ. 12 కోట్లు నష్టాల్లో ఉండగా, అందులో ఐదుగురు ఉద్యోగులకు జీతాలు పెంచేశారు. నిజాంపట్నం బ్రాంచ్ పరిధిలో కూచిపూడి పీఎసీఎస్ రూ.4.50 కోట్లు నష్టం ఉండగా అందులో టైమ్‌బార్డ్ అప్పులు ఉన్నాయి. అందులో నలుగురు ఉద్యోగులు పర్మినెంట్ ఉండగా నలుగురు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. ఇక్కడ పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు అడ్డదిడ్డంగా పెంచేశారు. ఈ ఆగస్టు నెలలో కొత్త పాలకవర్గం ఏర్పడగా ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పాలకవర్గం అధ్యక్షులు నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు పెంచాలంటే జిల్లా స్థాయి కమిటీలో పెంచాల్సి ఉండగా, మామూళ్లు తీసుకుని డివిజనల్ సహకార అధికారులు జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చేశారు. ఇందులో కొన్నిచోట్ల డిపార్ట్‌మెంట్ పర్సన్ ఇన్‌చార్జులు ప్రతిపాదనలు పంపిస్తే డిప్యూటీ రిజిస్ట్రార్‌లు మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేశారు. దీనిపై విచారణ జరిపితే కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది.