
జాతీయ పోటీలకు రోషన్ ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 41 జాతీయ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో స్థానిక ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన ఎస్‌కే రోషన్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటాడని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రోషన్ 110 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుడు అవార్డును కూడా గెలుపొందాడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోషన్‌ను ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారని తెలిపారు. రోషన్‌కి సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రసాద్ తెలియజేశారు.
ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్తమ సేవలు
డీఆర్‌ఎం సుథేష్ట సేన్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : విక్షిత్ భారత్– 2047 భాగంగా సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారత ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్‌ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం అమృత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా విక్షిత్ భారత్– 2047 కార్యక్రమంలో ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం సామాజిక, ఆర్థిక వృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్ర గురించి తెలిపారు. పరిశుభ్రత, భద్రత, సమర్థ సేవలను అందించడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రయాణికులకు సంతృప్తిని అందించడంతో పాటు జాతీయ అభివృద్ధికి దోహదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయాణికులతో సంభాషించి వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్, డీసీఎం కమలాకర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్యానికి డబ్బులు
లేవన్నందుకు దాడి
వ్యక్తికి గాయాలు
సత్తెనపల్లి: వుద్యానికి డబ్బులు లేవన్నందుకు బావ తలను బావమరిది పగలగొట్టిన సంఘటన పట్టణంలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాప్ వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పెదాల నరసింహారావు మద్యం తాగేందుకు రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా.. కొద్దిసేపటికి వరుసకు బావమరిది అయ్యే చెరుకూరి మణి వచ్చి మద్యం ఇప్పించమని అడిగాడు. తన వద్ద క్వార్టర్‌కే డబ్బులు ఉన్నాయని, అయినా తాగే ఉన్నావుగా.. ఇంకెందుకంటూ దూషించి, మందలించాడు. మద్యం ఇప్పించకపోగా తననే దూషిస్తావా? అంటూ మణి మద్యం సీసా తీసుకొని నరసింహారావు తలపై కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ పోటీలకు రోషన్ ఎంపిక