
శివాలయంలో అన్నదానానికి విరాళం
పెదకాకాని: స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి గ్రామానికి చెందిన కానుగంటి రాధాకృష్ణమూర్తి, సామ్రాజ్యం దంపతుల పేరున వారి కుమారుడు హరిబాబు, నాగేశ్వరి దంపతులు ఆదివారం రూ. 1,00,116ను విరాళంగా అందజేశారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున అన్నప్రసాద వితరణ చేయాలని దాతలు కోరారు. ఆలయ సిబ్బంది దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, చిత్రపటాన్ని బహూకరించారు.
సైడు కాలువలో పడి
వ్యక్తి మృతి
కాకుమాను: సైడు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బాపట్లకు చెందిన మాచవరపు వెంకటేశ్వరరావు (40) శనివారం ఉదయం గుంటూరు జిల్లా కాకుమానులోని అత్తగారింటికి వచ్చాడు. అదేరోజు రాత్రి పూటుగా మద్యం తాగి తిరిగి వెళుతున్న సమయంలో అదుపుతప్పి పక్కనే సైడు కాలువలోనికి పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున అటుగా వెళుతున్న స్థానికులు కాలువలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. సమాచారాన్ని మృతుని కుటుంబాలతో పాటు పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ప్రజావైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏక్‌నాథ్ తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
8న సెపక్‌తక్రా
జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8వ తేదీన జరుగుతాయని అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్, పి.శివరామకృష్ణలు ఆదివారం తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. ఎంపికయిన క్రీడాకారులు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా చీరాలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 8712129398, 99851 86556 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

శివాలయంలో అన్నదానానికి విరాళం